నవంబర్‌ మొదటివారంలో..  కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలిజాబితా


– రెండురోజుల్లో కూటమి సీట్ల సర్దుబాటు పూర్తిచేస్తాం
– బీసీలకు కేసీఆర్‌ ఇచ్చిన సీట్లకంటే ఎక్కువే ఇస్తాం
– కేసీఆర్‌ను ఓడించేందుకు కూటమిలో సీట్ల త్యాగానికైనా సిద్ధం
– కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా
న్యూఢిల్లీ, అక్టోబర్‌23(జ‌నంసాక్షి) : నవంబర్‌ మొదటివారంలో కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలిజాబితా విడుదల చేయనున్నట్లు తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ కుంతియా పేర్కొన్నారు. మంగళవారం ఆయన ఢిల్లీలో విూడియాతో మాట్లాడారు. పొత్తులు కూడా ఓ రెండ్రోజులలో ఖరారు కానున్నాయని ఆయన
తెలిపారు. ఈ నెలాఖరున స్కీన్రింగ్‌ కమిటీ సభ్యులు మరొకసారి సమావేశమై వివిధ సామాజిక వర్గాలకు చెందిన నాయకుల నుంచి అభిప్రాయాలను తీసుకొంటారని ఆయన అన్నారు. బీసీలకు కేసీఆర్‌ ఇచ్చిన సీట్లకంటే ఎక్కువ ఇస్తామన్నారు. గెలిచే అభ్యర్థుల ప్రాతిపదికగా చర్చలు జరుగుతున్నాయని కుంతియా తెలిపారు. టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఓడించేందుకు కూటమిలో సీట్ల త్యాగానికి కాంగ్రెస్‌ సిద్ధమైందని ఆయన అన్నారు. సామాజిక వర్గాలు, గెలిచే అభ్యర్థుల ప్రతిపాదికగా సీట్ల కేటాయింపు అంశమై చర్చలు జరుపుతున్నామని కుంతియా పేర్కొన్నారు. మహాకూటమి సీట్ల సర్దుబాట్ల విషయం త్వరగా పూర్తవ్వాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. తెలంగాణలోని మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు పోటీ చేస్తారని స్పష్టం చేశారు. ఒక్కో నియోజక వర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీకి 15 మంది ఆశావహులు ఉన్నారని పేర్కొన్నారు. ముందుగా ఈ నెల 27న పార్టీ అధినేత రాహుల్‌ గాంధీతో ఓ భారీ ర్యాలీని నిర్వహించాలని నిర్ణయుంచామని చెప్పారు. అయితే ఖమ్మం, మహబూబ్‌ నగర్‌, కరీంనగర్‌ లలో ఎక్కడ నిర్వహించాలనే అంశం పై త్వరలోనే నిర్ణయం తీసుకొంటామని కుంతియా తెలిపారు. రాహుల్‌ గాంధీ తో మూడు ర్యాలీలను నిర్వహించిన తర్వాత పార్టీ కార్యకర్తలలో ఉత్సాహం రెట్టింపు అయిందని ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో కి వస్తుందని కుంతియా ధీమా వ్యక్తం చేశారు.