నవీన్ మృతదేహం తరలింపులో జాప్యం
అసాధ్యంగా మారిన అక్కడి పరిస్థితులు
కొడుకు కడసారి చూపుకోసం తల్లిదండ్రుల కన్నీరుమున్నీరు
గాయపడ్డ మరో విద్యార్థి ఆచూకీ కోసం సిఎం బొమ్మై యత్నాలు
న్యూఢల్లీి/బెంగళూరు,మార్చి2(జనం సాక్షి): ఉక్రెయిన్‌లో మృతి చెందిన భారత విద్యార్థి నవీన్ మృతదేహం తరలింపుపై ఎలాంటి స్పష్టతా కానరావడం లేదు. అక్కడి ఎంబసీ అధికారులు ఇందుకోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఉక్రెయిన్ పై రష్యా దాడుల్లో అటు సైన్యంతో పాటు ఇటు పౌరులు కూడా ప్రాణాలు విడుస్తున్నారు. కర్ణాటకకు చెందిన నవీన్ అనే వైద్య విద్యార్థి ఉక్రెయిన్ లోని ఖర్కీవ్‌లో చనిపోయిన సంగతి తెలిసిందే. దీంతో మిగతా విద్యార్థుల తల్లిదండ్రుల్లోనూ ఆందోళన నెలకొంది. అయితే నవీన్ మృతదేహం భారత్‌కు తరలింపుపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నవీన్ డెడ్ బాడీని తరలించడం కష్టమని ఉక్రెయిన్ అధికారులు భారత ఎంబసీకి చెప్పినట్లు సమాచారం. మరో వైపు నవీన్ తల్లిదండ్రులు మృతదేహం కోసం ఎదురుచూస్తున్నారు. తన కొడుకు చివరి చూపు కోసం తపిస్తున్నారు. మృతదేహాన్ని తమకు అప్పగించాలని కోరుతున్నారు నవీన్ తండ్రి శేఖరప్ప జ్ఞానగౌడర్ . కర్ణాటక ప్రభుత్వం కూడా నవీన్ మృతదేహం తరలింపునకు ప్రయత్నాలు చేస్తోంది. ఉక్రయిన్‌లోని ఖార్కివ్ సిటీపై రష్యా బలగాలు జరుపుతున్న దాడిలో గాయపడిన హవేరి జిల్లా విద్యార్థి ఆచూకీ తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై బుధవారంనాడు తెలిపారు. ఖార్కివ్ నగరంపై మంగళవారం రష్యా సైనం జరిపిన క్షిపణి దాడిలో 22 ఏళ్ల శేఖరప్ప గ్యానగౌడర్ నవీన్ ప్రాణాలు కోల్పోవడం ఇప్పటికే కర్ణాటకలో విషాదం నిపింది. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడి మొదలు పెట్టినప్పటి నుంచి అక్కడి భారతీయులు మరణించడం తొలిసారి. కాగా, ఇదే దాడిలో హవరే జిల్లా విద్యార్థి గాయపడిన విషయంపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు. అతను సురక్షితంగానే ఉన్నట్టు ఒక సమాచారం ఉండగా, గాయపడినట్టు మరో సమాచారం ఉందని, ధ్రువీకరణ కోసం వేచిచూస్తున్నామని చెప్పారు. ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయంతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు