నాణ్యత ఫట్టు.. ముక్కముడితే ఒట్టు..!!
– ప్రముఖ హోటల్ లో రెండ్రోజుల మాంసాహారం వడ్డింపు
– ఎన్నో దుకాణాల్లో మరిగించిన నూనె.. మాయచేసే కిచెన్లు
– రోడ్డుపక్కన టిఫిన్స్, స్వీట్ షాపుల్లోకి దుమ్మూ ధూళి
– పీర్జాదిగూడలో తనిఖీలను గాలికొదిలేసిన అధికారులు
మేడిపల్లి – జనంసాక్షి
చిన్న నుంచి పెద్దస్థాయి వరకు ఏ హోటల్ వెళ్ళినా “నో అడ్మిషన్ ఇన్ కిచెన్” అని తాటికాయంత అక్షరాలతో రాసి పెడతారు. కానీ అక్కడ చేసేదంతా ఎవరికీ తెలియకుండా దాచేస్తారు. రోజుల కొద్ది మరిగించిన నూనె.. నిల్వ ఉంచిన మాంసం, ఇతర ఆహార పదార్థాలను వండి వడ్డిస్తున్నారు. రోడ్డుపక్కన ఉన్న హోటల్స్, దుకాణాల్లోనైతే మరీ అద్వానం..! వాహనాల నుంచి వచ్చే పొగ, రోడ్డుపైనుంచి దుమ్మూ ధూళి కణాలు.. నిత్యం వినియోగించే వస్తువులు, రోజు తినే ఆహార పదార్ధాలపై పేరుకుపోతున్నాయి. ఇదంతా అభివృద్ధిలో దూసుపోతున్నట్టు భావిస్తున్న పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కళ్లముందే జరుగుతున్నా.. ఆహార తనిఖీ అధికారులు నాణ్యత విషయాలను గాలికొదిలేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
నగర పరిధిలోని వివిధ ప్రాంతాల్లో వందల సంఖ్యల్లో హోటల్స్ ఉన్నాయి. అందులో స్వీట్ షాపులు, చిప్స్, మిర్చి బజ్జీ నిర్వాహకులు కూడా ఉన్నారు. బుద్దనగర్ 40ఫీట్ రోడ్డులో చిన్న చిన్న బండ్లు, డిపో ఎదుట కూడా నిర్వహించేవారు ఎక్కువగానే ఉన్నారు. అయితే వారు వినియోగిస్తున్న వంట నూనె సామగ్రి విషయంలో మాత్రం ఎప్పటినుంచో ఆరోపణలు వస్తున్నాయి. సరైన ఆయిల్ వాడటం లేదని, దుకాణాల్లో కూడా మరిగించిన నూనె రోజుల కొద్ది వినియోగిస్తున్నారని పలు సందర్భాల్లో ఎంతోమంది ఫిర్యాదులు కూడా చేశారు. అయినప్పటికీ హోటల్ యాజమాన్యాలు నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని తెలుస్తోంది. గతంలో పారాడైజ్ హోటల్ సీజ్ చేసినా… ఆ తర్వాత తనిఖీలను విస్మరించారు. వారంవారం తనిఖీ చేపడతామన్న అధికారులు సైతం ఎక్కడివారక్కడే ఉండిపోయారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ప్రముఖ హోటల్లో రెండ్రోజుల నాన్ వెజ్ ను వండి పెట్టడం వివాదాస్పదమైంది. అడ్డగోలుగా ట్యాక్స్ రూపంలో వసూలు చేస్తున్నా.. నాణ్యమైన భోజనం మాత్రం అందించడం లేదని స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. శానిటేషన్ అధికారులు సైతం శుచి శుభ్రత విషయంలో ఏమాత్రం నిఘా పెట్టకపోవడం గమనార్హం.
పట్టుబడినా పటిష్ట చర్యలు శూన్యం..
గతంలో ఎన్నోమార్లు పలు హోటల్స్ లో నాసీరకపు భోజనం పట్టుబడినా అప్పటికప్పుడు తీసుకున్న చర్యలు మళ్ళీ కొనసాగలేదు. వారం వారం తనిఖీలు చేస్తామని చెప్పిన అధికారులు ఎటు వెళ్లారనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. హోటల్ యాజమాన్యాలకు శానిటేషన్ విభాగ అధికారులు వత్తాసు పలుకుతున్నారని విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. సరైన పార్కింగ్ లేకపోయినా.. సమయానికి మించి తెరిచి ఉంచుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఫలితంగా ఎన్నో సందర్భాల్లో రాత్రి సమయాల్లో మద్యం ప్రియులు భోజనం కోసం రోడ్లపై తిరుగుతూ గొడవలు కూడా పడ్డారు. అందువల్ల ఇప్పటికైనా కిచెన్లో పరిస్థితిని పరిశీలించి, నాణ్యమైన ఆహార పదార్థాలను అందించేలా అధికారులు చర్యలు చేపట్టాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు.
వ్యర్థాలతో ఇబ్బందులు…
తోపుడు బండ్లు, చిన్నచిన్న బండ్లతో పెద్దగా వ్యర్థాలు లేకపోయినా.. ఇతర హోటళ్ల నుంచి మాత్రం ఆహారపు వ్యర్థాలు స్థానికులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. మిగులు పదార్థాలు, కిచెన్ లోని వ్యర్థాలను హోటళ్ల వెనుకభాగంలో పడేస్తుండటం వల్ల పందులు, కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గాలికి కవర్లు, ప్లేట్లు, ఇతర వ్యర్థాలు రోడ్డుపైకి కొట్టుకురావడం, అక్కడే కుక్కలు, పందులు వాటిని పీక్కుతినడం వల్ల స్థానికులు, వాహనదారులు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఇంత తతంగం జరుగుతున్న కూడా అధికారుల్లో చలనం లేకుండా పోయిందని ప్రజలు మండిపడుతున్నారు.