నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యం
– లోటుబడ్జెట్ ఉన్నా విద్యాశాఖకు అత్యధిక బడ్జెట్ కేటాయించాం
– ప్రభుత్వ పాఠశాలను బలోపేతంచేసేలా చర్యలు తీసుకుంటున్నాం
– పదోతరగతిలో 20శాతం ఇంటర్నల్ మార్కులపై కమిటీవేశాం
– విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు
విజయవాడ, ఆగస్టు11(జనం సాక్షి) : విద్యా వ్యవస్థల్లో మార్పు తీసుకురావడం, నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధప్రదేశ్ మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. శనివారం ఏపీ అన్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్య సదస్సు నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఏపీయూఎస్‌ఎంఏ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘విద్యా వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వం వినూత్న విధానాలు తీసుకొస్తోందన్నారు. రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చాలని, పిల్లలకు విలువలు, నైపుణ్యతతో కూడిన విద్యను అందించాలని సీఎం లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. రూ.15వేల కోట్ల లోటు ఉన్నా, విద్యాశాఖకు అత్యధిక బడ్జెట్ కేటాయించారన్నారు. ప్రభుత్వ బడులపై పిల్లల తల్లిదండ్రులకు నమ్మకం కల్పించలేకపోయాయని, అందుకే పిల్లల్ని ప్రైవేటు పాఠశాలల్లో చేర్పిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరికను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మేం తీసుకుంటున్న చర్యల వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు 5శాతం పెరిగాయని మంత్రి స్పష్టం చేశారు. పదో తరగతిలో 20శాతం ఇంటర్నల్ మార్కులపై కమిటీ వేశామని, కమిటీ నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకుంటామని గంటా తెలిపారు. ఇకపై ప్రైవేటు పాఠశాలలతో చర్చించి ఆమోదించాకే ప్రభుత్వం కొత్త నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. ప్రైవేటు పాఠశాలల సమస్యల పరిష్కారానికి త్వరలో ఏపీయూఎస్‌ఎంఎతో సీఎం సమావేశమవుతారని గంటా తెలిపారు.