నామ మాత్రంగా మిషన్ భగీరథ పైప్ లైన్ పనులు
*నామ మాత్రంగా మిషన్ భగీరథ పైప్ లైన్ పనులు*
*తీవ్ర అవస్థలు పడుతున్న వాహన చోదకులు*
*అయినా పట్టించుకోని గ్రామపంచాయతీ పాలకవర్గం*
బయ్యారం,జులై11(జనంసాక్షి):
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో మిషన్ భగీరథ పైప్ లైన్ ల కోసం బయ్యారం-మహబూబాబాద్ ప్రధాన రహదారికి ప్రక్కన, బయ్యారం నుండి ఇర్సులాపురం వెళ్లే రెండు దారులలో రోడ్డు కి ఇరువైపులా పైప్ లైన్ కోసం తీసిన గుంతలు పైప్ లైన్ వేసిన తర్వాత కూడా పూర్తిస్థాయిలో తిరిగి ఆ గుంతలను పూడ్చకపోయేసరికి గత 4రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో మట్టి కుంగి పోయి పెద్ద పెద్ద గుంతలుగా ఏర్పడ్డాయి.వేసవి కాలం మొత్తం కాలయాపన చేసి తీరా వర్షాకాలం మొదలయ్యాక ఈ పనులు మొదలు పెట్టడం పై అధికారులపై విమర్శలు గుప్పుమన్నాయి.ఇదే విషయం పై గతంలో జనంసాక్షి లో కథనం ప్రచురితమయినప్పటికి అధికారులు గాని, బయ్యారం సర్పంచ్ గాని స్పందించలేదు.ఈ గుంతల కారణంగా గడిచిన వారంలో రోజుకి ఒకటో రెండో వాహనాలు ఈ గాడిల్లో ఇరుక్కుంటున్నాయి.వాటిని తిరిగి వెలికి తీయడానికి గంటల సమయం పట్టడంతో వాహనాలు వెళ్లలేక ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి వాహన చోదకులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.రహదారికి ప్రక్కన వెళుతున్న లోకల్ ఆటోలు,ఇర్సులాపురం అడ్డా పై ఉండే ఆటోలు ఈ మార్గంలో వెళ్లడంతో అవి కూడా గాడిల్లో ఇరుక్కుని ప్రయాణికులు, ఆటో డ్రైవర్లు అవస్థలు పడుతున్నారు.ఇంత జరుగుతున్నప్పటికీ కాంట్రాక్టర్ గానీ, సంబంధిత అధికారులుగానీ చర్యలు మాత్రం శూన్యం.ఇలాగే వదిలేస్తే ప్రమాదాలు పెరిగే అవకాశం లేకపోలేదు.మండల కేంద్రంలోనే ఇలా ఉంటే మారుమూల గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చునని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా ఈ విషయం పట్ల అధికారులు స్పందిస్తారో లేదో వేచి చూడాలి