నాయి బ్రాహ్మణుల మనోభావాలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలి

జిల్లా అధ్యక్షుడు కడియాల సత్యనారాయణ

జూలూరుపాడు, ఆగష్టు 14, జనంసాక్షి: నాయి బ్రాహ్మణుల మనోభావాలను కాపాడేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తరహాలోనే తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక చర్యలు తీసుకురావాలని నాయి బ్రాహ్మణ సేవాసంఘం జిల్లా అధ్యక్షుడు కడియాల సత్యనారాయణ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. శాస్త్ర, సాంకేతికంగా, సామాజికంగా దేశం అభివృద్ధి చెందుతున్నా కానీ గ్రామాల్లో నాయి బ్రాహ్మణులు అనాదిగా వివక్షకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాయి బ్రాహ్మణులను కించపరిచే విధంగా, మనోభావాలను దెబ్బతీసే విధంగా గ్రామాల్లో ఇప్పటికీ కొందరు కులాన్ని అవమానపరుస్తూ మాట్లాడటం బాధాకరమని అన్నారు. సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా పదాలు వాడటం పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా బాగుందని, ఇదే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా నాయి బ్రాహ్మణులను కించపరిచే విధంగా పదాలను వాడినప్పుడు, వారి మనోభావాలను కాపాడేందుకు ప్రభుత్వం చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. నాయి బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బ తినకుండా వారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకై చట్టపరమైన చర్యల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవోను తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.