నాలుగేళ్లలో రెండంకెల అభివృద్ధి సాధించిన..

ఏకైక రాష్ట్రం ఏపీ
– ముందుచూపుతో రాష్ట్రానికి ఓ విజన్‌ తయారు చేశాం
– అభివృద్ధితో పాటు ఆనందంలోనూ ఏపీని ముందువరుసలో నిలిపేలా కృషి
– సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించవచ్చు
– ఎవరు సహకరించినా.. సహకరించకపోయినా ముందుకెళ్తాం
– ఉత్తరాంధ్ర అభివృద్ధి పెద్దపీట వేస్తున్నాం
– అన్ని ప్రాంతాలు, జిల్లాలు సమానంగా అభివృద్ధి పర్చేలా కృషి చేస్తున్నాం
– చంద్రన్న బీమా, ఎన్టీఆర్‌ వైద్య సేవ పథకాలతో పేదలకు ఆసరా
– పేదలకు రూ. 50వేల కోట్లతో 19లక్షల గృహాలను నిర్మించాం
– ఎస్సీలు, ఎస్టీలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందజేస్తున్నాం
– వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక బడ్జెట్‌ ప్రవేశపెట్టాం
– కాపు కార్పొరేషన్‌ వెయ్యి కోట్లు కేటాయించాం
– రూ.26 కోట్లతో జిల్లాకో కాపు భవనం నిర్మిస్తున్నాం
– అన్న క్యాంటీన్లతో పేదల ఆకలి తీరుస్తున్నాం
– జాతి పునఃనిర్మాణానికి అందరం పునరంకితం కావాలి
– స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
– శ్రీకాకుళం జిల్లా ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో జాతీయ జెండాను ఎగురవేసిన సీఎం
శ్రీకాకుళం, ఆగస్టు15(జ‌నం సాక్షి) : ఎన్ని కష్టాలు ఉన్నా అదిరోహిస్తూ నాలుగేళ్లలో రెండు అంకెల అభివృద్ధి సాధించిన ఏకైక రాష్ట్రం ఏపీ అని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి ఎవరు సహకరించినా, సహకరించకపోయినా ముందుకెళ్తున్నామని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో జరిగిన స్వాతంత్యద్రినోత్సవ వేడుకల్లో సీఎం పాల్గొని జాతీయజెండాను ఎగురవేశారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ వీరులకు జన్మనిచ్చిన భూమి ఇదని…ఎందరో రాజకీయ, సాహిత్య రంగాల ప్రముఖులు శ్రీకాకుం జిల్లా బిడ్డలే అని అన్నారు. ఎందరో మహానుభావులు తెలుగుజాతి ఖ్యాతిని పెంచారని తెలిపారు. జాతిపునఃనిర్మాణానికి తామంతా పునరంకితం కావాలని సీఎం పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి పెద్దపీట వేస్తామని, అన్ని ప్రాంతాలు, జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందాలని చంద్రబాబు పేర్కొన్నారు. వ్యవసాయంపై శ్రద్ధ పెట్టామన్న చంద్రబాబు, రాష్ట్రంలో రైతులను అన్ని విధాల ఆదుకొనేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. మహిళా సాధికారిత కోసం డ్వాక్రా సంఘాలు పెట్టామని చెప్పుకొచ్చారు. విద్యా, వైద్య రంగాల్లో సంస్కరణలు తెచ్చామని సీఎం అన్నారు. ముందుచూపుతో రాష్ట్రానికి ఒకవిజన్‌ తయారు చేశామని తెలిపారు. అభివృద్ధితో పాటు ఆనందంలో కూడా ఏపీ ముందుండాలని ఆకాంక్షించారు. సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించవచ్చని చంద్రబాబు స్పష్టం చేశారు.
విభజన కష్టాలు వెంటాడుతున్నాయని..కేంద్రం సహకరించడం లేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్‌లు ముందుకు సాగకుండా విపక్షాలు అడ్డుపతున్నాయని మండిపడ్డారు. నాలుగేళ్లలో రెండు అంకెల అభివృద్ధి సాధించిన ఏకైక రాష్ట్రం ఏపీ అని సీఎం తెలిపారు. ఎవరు సహకరించినా..సహకరించకపోయినా
ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు. ఉపాధి కూలీని రూ. 140 నుంచి రూ. 205కు పెంచామన్నారు. నిరుద్యోగ యువతకు వెయ్యి చొప్పున భృతి ఇస్తున్నామని, చంద్రన్న బీమా, ఎన్టీఆర్‌ వైద్య సేవ పథకాలతో పేదలకు ఆసరా కల్పించామన్నారు. కులాంతర వివాహాలను ప్రోత్సహించేందుకు చంద్రన్న పెళ్లికానుక అందుబాటులోకి తెచ్చామని సీఎం చంద్రబాబు తెలిపారు. వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక బడ్జెట్‌ ప్రవేశపెట్టామన్నారు. అలాగే వెనుకబడిన వర్గాల కోసం రూ. 46వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, బీసీ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి బీసీల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల పేదలకు రూ.200 కోట్లు కేటాయించామని సీఎం తెలిపారు. చేనేత కార్మికులకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని, రాబోయే రోజుల్లో వడ్డెరలు, మత్స్యకారులను ఎస్టీల్లో చేర్చుతామని ప్రకటించారు. రజకులను ఎస్సీల్లో చేర్చేందుకు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు. ఎస్సీలు, ఎస్టీలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందజేస్తామన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. విజయవాడ, కడపలో హజ్‌హౌస్‌ల నిర్మాణం చేపడతున్నామని, అలాగే చర్చిల నిర్మాణానికి ఆర్థికసాయం అందిస్తున్నామని తెలిపారు. కాపు కార్పొరేషన్‌కు రూ.1000 కోట్లు కేటాయించామన్నారు. కాపులకు రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసి పంపామని తెలిపారు. రూ. 26 కోట్లతో జిల్లాకో కాపు భవనం నిర్మిస్తున్నామని, బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ. 210 కోట్లు కేటాయించినట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. చంద్రన్న బీమా కింద రూ.5 లక్షల బీమా ఇస్తున్నామన్నారు. ఎన్డీఆర్‌ భరోసా కింద వృద్ధులకు పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. అన్న క్యాంటీన్లతో పేదల ఆకలి తీరుస్తున్నామని, నూటికి నూరుశాతం గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చామని సీఎం చెప్పుకొచ్చారు. డ్వాక్రా సంఘాలకు రూ. 10వేల కోట్లు కేటాయించామని, ఆదరణ పథకం ద్వారా కులవృత్తులకు అండగా నిలుస్తున్నామని తెలిపారు. రూ.750 కోట్లతో 5 లక్షల మందికి పనిముట్లు కల్పించామన్నారు. అలాగే ఎన్టీఆర్‌ వైద్య కింద రూ. 2.5 లక్షలు ఇస్తున్నామని తెలిపారు. ఉచిత డయాలసిస్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. విద్యారంగంలో తామే ముందున్నామని, రాష్టాన్ని నాలెడ్జ్‌ హబ్‌గా తయారు చేస్తామని స్పష్టం చేశారు. డిజిటల్‌, వర్చువల్‌ క్లాస్‌రూంలకు ప్రాధాన్యమిచ్చామన్నారు. పదేళ్ల కాంగ్రెస్‌ పాలనలో అభివృద్ధి నిలిచిపోయిందని విమర్శించారు.
రాష్ట్రానికి అనేక ఐటీ, ఎలక్టాన్రిక్‌ కంపెనీలు వచ్చాయని, అనంతపురంలో సౌత్‌కొరియా టౌన్‌షిప్‌ ఏర్పాటైందన్నారు. రూ. 50వేల కోట్లతో 19 లక్షల గృహాలను చేపట్టామని, గ్రావిూణ ప్రాంతాల్లో 13 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 6 లక్షల ఇళ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. పేదలకు కట్టించే ఇళ్లకు సవిూపంలో ఎకనమిక్‌ సిటీలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. నాలుగు లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని సీఎం చంద్రబాబు తెలిపారు.  రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపేలా ప్రతి ఒక్కరం కృషి చేయాలని చంద్రబాబు ఈసందర్భంగా పిలుపునిచ్చారు.

తాజావార్తలు