నా ఓటమికి ఎఫ్‌బీఐ కారణం
ఎఫ్‌బీఐ డైరెక్టర్ జేమ్స్ కోమే కారణంగానే తాను అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయినట్లు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి హిల్లరీ క్లింటన్ ఆరోపించారు. ఈ-మెయిల్స్ విషయంలో ఎఫ్‌బీఐ తిరిగి విచారణ జరపడంతో తాను అధ్యక్ష పదవి కోల్పోయానని.. చెప్పాలంటే ఇలాంటి కారణాలు చాలా ఉన్నాయని హిల్లరీ పేర్కొన్నారు. రిపబ్లికన్లకు మద్దతుగా ఉన్న అరిజోనా రాష్ట్రం కూడా డెమోక్రటిక్ పార్టీకే సపోర్ట్ చేసిందని.. అదే సమయంలో జేమ్స్ కోమే తన ఈ-మెయిల్ కేసును పునఃవిచారణ చేపట్టి తనకు క్లీన్‌చిట్ ఇవ్వడంతో అంతా గందరగోళంగా మారిపోయిందన్నారు. ఈ ఒక్క కారణంతోనే అరిజోనా రాష్ట్రం తమ చేతి నుంచి జారిపోయిందని అన్నారు. హిల్లరీ అమెరికా స్టేట్ సెక్రటరీగా ఉన్నప్పుడు వ్యక్తిగత ఈ-మెయిల్స్ చేసినట్లు ఆమెపై ఆరోపణలు వచ్చాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌కు రెండ్రోజుల ముందు ఈ-మెయిల్ కుంభకోణం విషయంలో ఎఫ్‌బీఐ హిల్లరీకి క్లీన్‌చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.