నా తర్వాత టార్గెట్ అదే: క్లార్క్
మెల్ బోర్న్: వన్డే వరల్డ్ కప్ సాధించిపెట్టిన ఆస్ట్రేలియా కెప్టెన్ మైఖేల్ క్లార్క్ తదుపరి లక్ష్యంపై గురిపెట్టాడు. టెస్టుల్లో తన టీమ్ ను ‘టాప్’కు తీసుకురావాలన్న పట్టుదలతో ‘పప్’ ఉన్నాడు. చివరి వన్డేలో చెలరేగి ఆడి జట్టుకు ప్రపంచకప్ అందించాడు క్లార్క్. మెల్ బోర్న్ క్రికెట్ మైదానంలో న్యూజిలాండ్ తో జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో క్లార్క్ 74 పరుగుల చేసి వన్డే కెరీర్ కు ఘనంగా వీడ్కోలు పలికాడు.
ఇప్పుడు టెస్టులపై దృష్టి పెట్టాడు. టెస్టుల్లో రెండో ర్యాంకులో ఉన్న ఆసీస్ టీమ్ ను అగ్రస్థానానికి తీసుకురావడమే తన ముందున్న టార్గెట్ అని క్లార్క్ వెల్లడించాడు. వెస్టిండీస్, ఇంగ్లండ్ తో జరగనున్న టెస్టు సిరీస్ లలో విజయం సాధిస్తామన్న దీమాను వ్యక్తం చేశాడు. వన్డేల నుంచి వైదొలగడంతో తన టెస్టు కెరీర్ పెరుగుతుందని అభిప్రాయపడ్డాడు. టెస్టు కమిట్ మెంట్ కారణంగా టి20 లీగ్ ల్లో ఆడే విషయం ఇప్పుడే చెప్పలేన్నాడు. టెస్టుల్లో దక్షిణాఫ్రికా అగ్రస్థానంలో కొనసాగుతోంది.