నిజాలకు నిప్పు

ఏమైందో ఏమో కానీ గతవారం ముంబయి సచివాలయంలో కరెంట్‌కు ఒక్కసారిగా కోపమొచ్చింది. వర్షాకాలంలో విద్యుత్‌ షార్ట్‌ సర్కూట్‌తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఏముంది ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన అంటూ జరిగిన విషయాన్ని అక్కడి ఏలికలు చిన్నదిగా చేసి చూపే ప్రయత్నం చేసినప్పటికీ దాని తీవ్రత, జరిగిన నష్టాన్ని గమనిస్తే కేవలం ప్రమాదవశాత్తు జరిగిందంటే నమ్మడానికి ఎవరూ సిద్దంగా లేరు. అతి విలువైన సమాచారం, సంచలనం రేపిన ఆదర్శ్‌ కుంభకోణానికి సంబంధించిన విలువైన డాక్యుమెంట్స్‌ అన్నీ ఈ ప్రమాదంలో కాలి బూడిదయ్యాయి. అయితే అందులోని నిజాలను కాల్చి బూడిద చేయాల్సిన అవసరం ఎవరికుందో పనిగట్టుకొని ఎవరో నిగ్గుతేల్చాల్సిన అవసరం లేదు. జరిగిన సంఘటన గూర్చి అక్కడి మిగిలిన బూడిదే నిజాలు మాట్లాడింది. నిజం నిప్పు లాంటిదనీ, అది తమను కాల్చేయకముందే నిజాన్ని కాల్చి బూడిదచేశారన్నది జగమెరిగిన సత్యం. అంతేకాక అవే మంటలు తర్వాత డిల్లీని తాకాయి. పార్లమెంట్‌లోని డి-బ్లాక్‌ తగలబడింది. ఒకరిని చూసి మరొరు స్పూర్తి పొందినట్లు హోంశాఖకు చెందిన ముఖ్యమైన ఫైళ్లు తగలబడ్డాయి. అంతటితో ఆగకుండా అవే మంటలు డిల్లీలోని ఏ.పి.భవన్‌ను తాకి అక్కడినుండి వేల మైళ్ల దూరంలోని హైద్రాబాద్‌లో జూబ్లీహాల్‌ను తాకాయి. కట్టుదిట్టమైన భద్రతను దాటి ఏకంగా రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రణబ్‌ నగరంలో ప్రచారం నిర్వహించి, కాంగ్రెస్‌ నేతలతో సమావేశమైన జూబ్లీహాల్‌లోకే ప్రవేశించాయి.అయితే అప్పటికే ప్రణబ్‌ సమావేశం ముగియడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే మంటలు చెలరేగిన చాలా సమయానికి అగ్నిమాపక అధికారులు అక్కడికి చేరుకున్నారని సాక్షాత్తు అధికార పక్షానికి చెందిన ఓ ఎంపీ చేసిన వ్యాఖ్యలు అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. ఎందుకీ మంటలు ఓ చోట నుండి మరొక చోటికి వ్యాపిస్తున్నాయి. దీని వెనక ఏ కొరివి దయ్యం ఉందో ప్రభుత్వాలు తేల్చగలవా! ప్రమాదంపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహంతో స్పందిస్తూ దీని వెనక కారణాలను అన్వేషించమని చెప్పడం పరిస్థితి తీవ్రతకు అధ్దం పడుతుంది. సమాచార హక్కు చట్టం వచ్చాక రాజకీయ నాయకులు చేసే అవినీతిని ప్రజలు తేలికగా తెలసుకోగలుగుతున్నారు. ఫైళ్లలో దాగి ఉన్న నాయకుల పాపాల చిట్టాను ప్రజలు సునాయాసంగా బయటికి తీయగలుగుతున్నారు. ఇదే భయం అవినీతి కూపంలో చిక్కుకున్న రాజకీయ నాయకులను భయపెడ్తుంది. అక్రమార్కుల గుండె దడదడలాడేలా చేస్తుంది. అందుకే తమకు నచ్చని దాన్ని నిప్పుతో తగలబెట్టేస్తున్నారు. ఈ నిప్పు వెనక దాగిన నిజాలు బయటికి రావల్సిన అవసరం ఉన్నా, వాటిని బయటకు తీసేవారెవరో?