నిబంధనలు ఉల్లంఘించిన..
క్వారీలపై కఠిన చర్యలు
– హత్తిబెళగల్ వద్ద క్వారీలో జరిగిన ఘటనపై చంద్రబాబు దిగ్భాంతి
– మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం
– క్వారీ యాజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న సీఎం
– ఘటన స్థలానికి వెళ్లాలని ¬ంమంత్రి, డీజీపీలను ఆదేశించిన బాబు
– ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశం
– దుర్ఘటన జరిగినప్పుడల్లా ప్రతిపక్షాలు రాజకీయాలు విమర్శలు మానుకోవాలని బాబు హితవు
అమరావతి, ఆగస్టు4(జనం సాక్షి) : రాష్ట్రంలో నిబంధనలకు విరుద్దంగా నడిచే క్వారీలను సీజ్‌చేసి, యాజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కర్నూల్ జిల్లాలో శుక్రవారం రాత్రి క్వారీలో జరిగిన ప్రమాదంపై బాబు తీవ్ర ద్రిగ్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. వెంటనే ఘటన స్థలానికి వెళ్లాలని ¬ం మంత్రి చిన రాజప్ప, డీజీపీ ఆర్పీ ఠాకూర్‌లను ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన క్వారీ యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మైనింగ్, పోలీసు శాఖలు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని పేర్కొన్నారు. దుర్ఘటన జరిగినప్పుడల్లా ప్రతిపక్షాలు రాజకీయ విమర్శలు చేయడం శోచనీయం అని విమర్శించారు. మైనింగ్ దుర్ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశిస్తున్నట్లు సీఎం తెలిపారు. బాధితులను ఆదుకుంటామని.. దోషులకు కఠిన శిక్ష పడేలా చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా ఆలూరు పరిధిలోని హత్తిబెళగల్ వద్ద క్వారీలో రాత్రి భారీ పేలుళ్లు జరిగాయి. వెనువెంటనే మంటలు ఎగిసిపడ్డాయి. 10 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో కొందరి శరీరభాగాలు చెల్లాచెదురుగా చుట్టుపక్కల ఎగిరిపడ్డాయి. మరో నలుగురు కూలీలు వికాస్, మనోహర్, రాజేంద్రన్, రామచంద్ర అగ్నికీలల్లో చిక్కుకుని సగం శరీరం కాలిపోయి.. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. క్షతగాత్రులను తొలుత ఆలూరు ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. మృతులు..క్షతగాత్రులంతా ఒడిశా రాష్ట్రానికి చెందిన వారిగా అధికారులు గుర్తించారు.