నిమ్మకూరులో విషాధ చాయలు
– హరికృష్ణతో ఉన్న జ్ఞాపకాలను నెమరవేసుకున్న గ్రామస్తులు
కృష్ణా, ఆగస్టు29(జనం సాక్షి) : నందమూరి హరికృష్ణ ఆకస్మిక మృతితో ఆయన స్వగ్రామం నిమ్మకూరులో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ వార్త తెలిసిన వెంటనే ఆ గ్రామంలోని వారంతా కన్నీటి పర్యంతం అయ్యారు. హరికృష్ణ వివాహం అయ్యే వరకు అక్కడే తిరిగేవారని, తామందరితో ఎంతో కలివిడిగా తిరిగేవాడని నిమ్మకూరులోని హరికృష్ణ సన్నిహితులు పేర్కొన్నారు. అలాగే నిమ్మకూరుతో హరికృష్ణకు ఉన్న సంబంధాన్ని వాళ్లు పంచుకున్నారు. హరికృష్ణ నిమ్మకూరు ఎప్పుడు వచ్చినా అందరితో కలివిడిగా ఉండేవాడని, ఆయన ఇక్కడి అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడని పేర్కొన్నారు. చిన్నప్పటి నుంచి ఇక్కడే చదువుకున్నాడని, బంధుమిత్రులతో అనుబంధంగా ఉండేవాడని, ఎంపీ నిధుల నుంచి రూ. మూడున్నర కోట్లు మంజూరు చేసి గ్రామంలో రోడ్డు, నీటి సరఫరా తదితర పనులు చేశాడని గ్రామస్తులు తెలిపారు. పక్క గ్రామాలను కూడా ఎంతో అభివృద్ధి చేశారని, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో హరికృష్ణ తెలియని వారు లేరని గ్రామస్తులు కన్నీరు మున్నీరవుతున్నారు. నిమ్మకూరులో ఉన్న వారిలో చాలా మంది పేర్లు తెలుసని, అంతేకాదు, ఎన్టీఆర్ గారి తర్వాత గ్రామంలో ఎవరి ఇల్లు ఎక్కడుందో హరికృష్ణ ఒక్కడికే తెలుసని, అలాంటి వ్యక్తి లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం అంటూ నిమ్మకూరులోని హరికృష్ణ బంధువులు, సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడు జానకీ రాం రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో హరికృష్ణ మానసికంగా బాగా కృంగిపోయారనీ, చివరిసారిగా 10 నెలల క్రితం కుమారుడు కల్యాణ్‌రామ్‌తో కలిసి హరికృష్ణ నిమ్మకూరు వచ్చారంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. మరణ వార్త తెలిసిన వెంటనే ఎన్టీఆర్ బంధువులు హుటాహుటిన హైదరాబాద్‌కు బయలుదేరారు. అదేవిధంగా హరికృష్ణ మృతితో కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో విషాద ఛాయలు అలముకున్నాయి. తోట్లవల్లూరు మండలంతో హరికృష్ణకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. సమయం కుదిరినప్పుడల్లా తోట్లవల్లూరు మండలం గరికపర్రుకు వచ్చి హరికృష్ణ విశ్రాంతి తీసుకునే వారు. గరికపర్రులో తన తోడల్లుడి నివాసానికి వచ్చే హరికృష్ణను.. ఉయ్యూరు, తోట్లవల్లూరు మండలాల ప్రజలు ఆత్మీయంగా కలిసేవారు. హరికృష్ణతో తమ జ్ఞాపకాలను వారు గుర్తుచేసుకుంటున్నారు.