నిర్మాణ కార్మికుల సంక్షేమానికి కృషి చేయాలి

ఏలూరు,ఆగస్ట్‌9(జ‌నం సాక్షి): చంద్రన్నబీమాతో సంబంధం లేకుండా భవన నిర్మాణ కార్మికులకు వెల్ఫేర్‌ బోర్డు ద్వారానే సంక్షేమ పథకాలు అమలు చేయాలని సిఐటియు డెల్టా జిల్లా కార్యదర్శి పివి.ప్రతాప్‌ డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం ద్వారా బిల్డింగ్‌ వర్కర్స్‌ వెల్ఫేర్‌ బోర్డు ఏర్పడిందన్నారు. కార్మికుల నుంచి సెస్‌ ద్వారా రూ.1400కోట్లు వెల్ఫేర్‌ బోర్డుకు వసూలు అయ్యాయన్నారు. చంద్రన్న బీమాతో సంబంధం లేకుండా ప్రమాదబీమా, సహజబీమా వంటి పథకాలు గతంలో మాదిరిగానే బిల్డింగ్‌ వెల్ఫేర్‌ బోర్డు ద్వారానే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. బోర్డు నిధులను కార్మికుల పింఛన్‌, గృహనిర్మాణం, పిల్లలకు స్కాలర్‌షిప్‌లు, పనిముట్లు కొగుగోలుకు రుణాల కోసం వినియోగించాలని సుప్రీం కోర్టు గతంలోనే చెప్పిందన్నారు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధంగా వివాహనికి, ప్రసవానికి రూ.50వేలు ఇవ్వాలని కోరారు. ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.10లక్షలు, సహజమరణానికి రూ.3లక్షలు ఇవ్వాలన్నారు. ప్రభుత్వం కార్మికుల డిమాండ్లను నెరవేర్చకపోతే సిఐటియు ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని ఇతర సంక్షేమ పథకాలకు కాకుండా కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేయాలని డిమాండ్‌ చేశారు.

 

తాజావార్తలు