నిలకడగా కరుణానిధి ఆరోగ్యం

– కరుణానిధిని పరామర్శించిన పళనిస్వామి, పన్నీర్‌సెల్వం
– ఆస్పత్రి వద్దకు భారీగా తరలివచ్చిన డీఎంకే కార్యకర్తలు
– ఆరోగ్య పరిస్థితిపై బులిటెన్‌ విడుదల చేయాలని డిమాండ్‌
– నాన్న కోలుకుంటున్నారు
– ఎవరూ ఆందోళనకు గురికావద్దన్న స్టాలిన్‌
– ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళనలో అభిమానులు
చెన్నై,జులై30(జ‌నం సాక్షి): డిఎంకే అధ్యక్షుడు కరుణానిది ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు, కుటుంబ సభ్యలు ప్రకటించారు. సోమవారం కరుణానిది ఆరోగ్యం కొంత నిలకడగా ఉందని ఆస్పత్రి వైద్యులు పేర్కొన్నారు. కరుణ ఆరోగ్యం విషమించడంతో చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం విదితమే. కాగా ఆదివారం రాత్రి కరుణానిది ఆరోగ్యం మరింత విషమించడంతో తమిళనాట డీఎంకే కార్యకర్తలు, అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఇదిలా ఉంటే  అనారోగ్యంతో చికిత్స పొందుతున్న తమ తండ్రి క్రమంగా కోలుకుంటున్నారని కరుణానిధి కుమారుడు ఎం.కె.స్టాలిన్‌ తెలిపారు. సోమవారం సిఎం పళనిస్వామి కరుణానిధిని పరామర్శషించి పరిస్తితిని వాకబు చేశారు.  ఆదివారం రాత్రి కరుణానిది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుసుకున్న అభిమానులు కరుణానిధి చికిత్స
పొందుతున్న కావేరీ ఆస్పత్రి వద్దకు సోవారం ఉదయం భారీ సంఖ్యలో చేరుకున్నారు. దీంతో ఆస్పత్రి వద్ద పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. ఎవరినీ లోనికి అనుమతించక పోవడంతో పోలీసులతో డీఎంకే కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతున్న తరుణంలో కరుణానిధి కుమారుడు ఎం.కె.స్టాలిన్‌ మాట్లాడుతూ… తమ తండ్రి కోటుకుంటున్నారని.. చికిత్సకు స్పందిస్తున్నారని తెలిపారు. కార్యకర్తలెవరూ ఆందోళన చెందొద్దని సూచించారు. ఎవరూ ఎక్కడా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడవద్దని కోరారు. డీఎంకే నేత ఎ.రాజా మాట్లాడుతూ.. కరుణానిధి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. నిన్న రాత్రి ఆరోగ్య పరిస్థితి విషమించిన మాట వాస్తవమేనని.. ఆ తర్వాత కోలుకుని చికిత్సకు స్పందిస్తున్నారని తెలిపారు. వైద్యులు కరుణానిధికి మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నారని వెల్లడించారు. త్వరలోనే ఆయన తిరిగి కోలుకుంటారని పేర్కొన్నారు.
పరామర్శించిన పళనిస్వామి, పన్నీర్‌సెల్వం..
అనారోగ్యంతో బాధపడుతున్న డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం సోమవారం ఉదయం పరామర్శించారు. ఆయన చికిత్స పొందుతున్న కావేరీ ఆస్పత్రికి చేరుకున్న వారిద్దరూ కరుణానిధి కుమారుడు స్టాలిన్‌, కుమార్తె కనిమొళితో మాట్లాడారు. కరుణానిధికి అందిస్తున్న వైద్య సేవల గురించి వైద్యులతో మాట్లాడారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పళనిస్వామి, పన్నీర్‌సెల్వంతో పాటు పలువురు మంత్రులు, ప్రముఖులు కరుణానిధిని పరామర్శించారు. అనంతరం వారు విూడియాతో మాట్లాడుతూ కరుణానిది ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారని ఎవరూ ఎలాంటి ఆందోళనకు గురికావద్దని సూచించారు. ఇదిలా ఉంటే తమ నేత ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత ఇవ్వాలని వారంతా కోరుతున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో కావేరీ ఆస్పత్రి పరిసరాల్లో ప్రభుత్వం పోలీసు బలగాలను మోహరించింది. సుమారు 3వేల మంది పోలీసులు ఆస్పత్రి, డీఎంకే కార్యాలయం వద్ద బందోబస్తు నిర్వహిస్తున్నారు. పోలీసుల సెలవులను ప్రభుత్వం రద్దు చేసింది.