నీట్ వాయిదా.. కేంద్రం ఆర్డినెన్స్

naddaదిల్లీ: నీట్‌ పరీక్షను ఏడాదిపాటు వాయిదావేయాలని ఆర్డినెన్స్‌ జారీ చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. దేశవ్యాప్తంగా మెడిసిన్‌కు ఒకటే ప్రవేశపరీక్ష- నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(నీట్‌)ను నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రాల అభ్యర్థన మేరకు శుక్రవారం సమావేశమైన కేబినెట్‌ నీట్‌ను ఏడాదిపాటు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్డినెన్స్‌ జారీ చేయడానికి ఆమోదం తెలిపింది. ఈ ఏడాది నుంచే నీట్‌ నిర్వహించడంపై అభ్యంతరాలు ఉన్నాయని.. చాలా మంది విద్యార్థులు పాత సిలబస్‌ ప్రకారమే సన్నద్ధమయ్యారని, ప్రాంతీయ భాషల్లో బోర్డు పరీక్షలు పాసైన విద్యార్థులు ఎక్కువగా ఉన్నారని, ఈ ఏడాది విద్యార్థులు కొత్త విధానానికి అలవాటుపడడం కష్టమని మంత్రివర్గం పేర్కొంది.

ఇటీవల సుప్రీంకోర్టు రాష్ట్రాలు విడిగా మెడికల్‌ ప్రవేశపరీక్షలు నిర్వహించుకునే విధానాన్ని తిరస్కరించి జాతీయ స్థాయిలో ఒకే పరీక్ష నీట్‌ నిర్వహించాలని ఆదేశించింది. అయితే చాలామంది విద్యార్థుల నుంచి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఇటీవల అఖిలపక్ష సమావేశం కూడా నిర్వహించారు. ఇందులోనూ నీట్‌ వాయిదా వేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈరోజు మంత్రివర్గ సమావేశంలో నీట్‌ వాయిదా ఆర్డినెన్స్‌కి ఆమోదం తెలిపారు.