నీరవ్‌ పంపించమని యూకెను కోరాం

– పార్లమెంట్‌లో కేంద్ర సహాయ మంత్రి వీకే సింగ్‌
న్యూఢిల్లీ, ఆగస్టు3(జ‌నం సాక్షి) : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ వేల కోట్ల రూపాయల కుంభకోణంలో ప్రధాన నిందితుడైన నీరవ్‌ మోదీని భారత్‌కు అప్పగించాల్సిందిగా బ్రిటన్‌ను కోరినట్లు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ సహాయమంత్రి వీకే సింగ్‌ పార్లమెంట్‌కు తెలియజేశారు. ‘విదేశాంగశాఖ, ¬ంమంత్రిత్వ నీరవ్‌ను భారత్‌కు అప్పగించమని అధికారికంగా యూకెను కోరింది. యూకెలో ఉంటున్న భారత ఆర్థిక నేరగాళ్లను తిరిగి పంపించాల్సిందిగా కోరుతూ 2002 నుంచి బ్రిటన్‌కు వినతి పత్రాలను పంపిస్తున్నాం. గత 16ఏళ్లలో యూకె ప్రభుత్వం భారత వినతులను తొమ్మిది సార్లు తిరస్కరించింది. నీరవ్‌తో పాటు విజయ్‌మాల్యాను కూడా వెనక్కి పంపించాల్సిందిగా కోరాం. దీనికి సంబంధించిన వినతి ఇంకా పెండింగ్‌లోనే ఉంది. భారత్‌ నుంచి యూకె వెళ్లిన 29వ ఆర్థిక నేరగాడు నీరవ్‌’ అని మంత్రి వీకే సింగ్‌ పార్లమెంట్‌కు తెలియజేశారు. పీఎన్‌బీ కుంభకోణంలో నిందితులైన నీరవ్‌, మెహుల్‌ ఛోక్సీల పాస్‌పోర్టును ఫిబ్రవరి నెలలో భారత్‌ రద్దు చేసినట్లు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. కానీ నీరవ్‌ ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్లడం ఆపలేదని ఆయన తెలిపారు. అయితే.. నీరవ్‌ ఎక్కడెక్కడికి ప్రయాణిస్తున్నాడో ధ్రువీకరించలేదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం నీరవ్‌ ఎక్కడ ఉన్నాడనే విషయంపై స్పష్టత రాలేదు. ఇక మరో నిందితుడైన ఛోక్సీ మాత్రం ఆంటిగ్వాలో ఉన్నట్లు ఆ దేశ ప్రభుత్వం ధ్రువీకరించింది. ఛోక్సీ తన వ్యాపారాన్ని విస్తృతం చేసుకునేందుకు ఆంటిగ్వా పౌరసత్వం తీసుకున్నట్లు అతడే స్వయంగా చెప్పాడు. పీఎన్‌బీ కుంభకోణం వెలుగులోకి రాకముందే నీరవ్‌, ఛోక్సీలు భారత్‌ విడిచి పారిపోయారు.