నీరుగారుతున్న మేకల సంరక్షణ పథకం

ఆదిలాబాద్‌,నవంబర్‌22: మేకల సంతతిని పెంపొందించాలనే ఉద్దేశ్యంతో కేంద్రం ప్రవేశపెట్టిన మేకల అభివృద్ది పథకం లక్ష్యం నెరవేరడంలేదు.  ప్రయోగత్మాకంగా చేపట్టిన ఈ పథకం ద్వారా ఆశించిన లక్ష్యం నెరవేరితే మరికొంత మంది రైతులకు లాభం చేకూరేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  పోషక విలువలు కలిగిన దానా అందజేయడంతో పాటు- సీజనల్‌ వ్యాధులకు దూరంగా ఆరోగ్యకరమైన మేకల సంతతి ఎదుగుదలకు ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ పథకం పనితీరు నిర్లక్ష్యం నీడన కొనసాగుతోంది. అయితే జిల్లాలో ఆ పరిస్థితులు కనిపించడం లేదు. నేషనల్‌ మిషన్‌ ప్రోటీన్స్‌ సప్లిమెంట్‌ ఆధ్వర్యంలో ఐదు గ్రామాలను క్లస్టర్‌గా గుర్తించడం జరిగింది.  పశువైధ్యశాల పరిధిలోని వెంట్రావుపల్లి, నర్వ, మిట్టపల్లి, దుబ్బపల్లి, జైపూర్‌ గ్రామాల్లో గల మేకల మందల్లో గల 2 వేల మేకల సంరక్షణ బా ధ్యతలు చేపట్టినా వాటి పట్ల శాఖపరమైన పట్టింపులేకుండా పోయింది.జిల్లాలో ఊట్నూర్‌, కుంటాల, జైపూర్‌ మండలాల పరిధిలోని వివిధ గ్రామాలను క్లస్టర్లుగా గుర్తించి మొదటి సారిగా ఎన్‌ఎంపీఎస్‌ స్కీంను ప్రవేశపెట్టారు.  ఆరోగ్యకరమైన మేకలు ఉత్పత్తిని దృష్టిలో పెట్టుకుని పశుసంవర్థకశాఖ ద్వారా పోషకవిలువలు కలిగిన దానా బస్తాలు రైతులకు అందజేశారు. అంతే కాకుండా ఒక్కొక్క క్లస్టర్‌ పరిధిలోని గుర్తించిన రెండు వేల మేకల బాగోగులు పరిశీలించేందుకు గోట్స్‌ స్కౌటర్‌ను నియమించడంతో పాటు వారం రోజుల పాటు వీరికి ఆర్‌ఏహెచ్‌టీసీ ద్వారా శిక్షణ ఇవ్వడం జరిగింది. 3 వేల రూపాయల జీతంతో ని యమించిన స్కౌట్‌ క్లస్టర్‌ పరిధిలోని మేకలకు సీజనల్‌ వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తగా టీ-కాలు వేయడం తో పాటు- సంబంధిత పశువైధ్యాధికారికి ఎప్పటికప్పుడు సమాచారం ఇవాల్సి ఉంది. నేటి వరకు జీతభత్యాలు అందని స్కౌట్‌ పనితీరు అంతంతమాత్రంగానే సాగుతోంది.రోజుకొకంటికీ 50 గ్రాముల దానా చొప్పున మూడు నెలల పాటు అందజేయాల్సిందిగా సూచిస్తూ రైతులకు అందజేసిన దానా బస్తాలు దుర్వినియోగం అయినట్లు తెలుస్తోంది.