నీలగిరి అడవుల్లో రిసార్ట్స్‌ నిర్మాణాలకు బ్రేక్‌

తక్షణం నిలిపి వేయాలన్న సుప్రీంకోర్టు

ఏనుగుల కారిడార్‌లో నిర్మాణాలపై ఆగ్రహం

న్యూఢిల్లీ,ఆగస్ట్‌9(జ‌నం సాక్షి): తమిళనాడులోని నీలగిరి పర్వత ప్రాంతాలలో చట్టానికి వ్యతిరేకంగా నిర్మితమౌతున్న 11 రిసార్టులను, ¬టల్స్‌ను 48 గంటలలోగా నిలిపివేయాలని ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. జస్టిస్‌ మదన్‌ బి.లోకూర్‌ నేతృత్వంలోని ధర్మాసనం నిర్మాణాలను వెంటనేనిలిపివేయాలని యజమానులకు ఆదేశాలు జారీ చేసింది. 24 గంటలలోగా వారి అనుమతి పత్రాలను కలెక్టర్‌కు సమర్పించాల్సిందిగా ఆదేశించింది. ఆ పత్రాలను పరిశీలించిన అనంతరం ఆనిర్మాణాలు అనుమతి లేకుండా నిర్మిస్తున్నట్లు నిర్ధారిస్తే వాటిని 48 గంటలలోగా నిలిపివేయాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌, జస్టిస్‌ దీపక్‌గుప్తాలు ఏనుగులు తమ జాతీయ వారసత్వమని పేర్కొంటూ అటువంటి నీలగిరి లోని ఏనుగుల కారిడార్‌లో నిర్మాణాలు ఎలా చేపడుతున్నారని ప్రశ్నించింది. తమిళనాడులోని ఏనుగుల కారిడార్‌ ప్రాంతాల్లో అనేక ¬టళ్లు, రిసార్టులు వస్తున్నాయని ఒకరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కాగా, మానవ – జంతు సంఘర్షణలను అరికట్టడానికి, జంతువుల మరణాలను తగ్గించడానికి ఏనుగు కారిడార్‌లను సంరక్షించాలనే అంశంపై కేంద్రం రెండు సమాచారాలను పంపినా ఏ ఒక్క రాష్ట్రం కూడా స్పందించలేదని, ఇది చాలా దురదృష్టకరమని సుప్రీంకోర్టు పేర్కొంది. 22 రాష్టాల్రలో 27 క్లిష్టమైన ఏనుగుల కారిడార్‌లు ఉన్నాయని కోర్టుకు కేంద్రం తెలిపింది. అయితే కోర్టు ఆదేశించినప్పటికి వాటిలో 13 రాష్టాల్రు ఈ విషయంలో స్పందించలేదని పేర్కొంది.