నీ బహుమానం మాకొద్దు
– మోదీ కోటి రూపాయల సహాయాన్ని తిరస్కరించిన ‘ఈదీ’
దిల్లీ,అక్టోబర్27(జనంసాక్షి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన కోటి రూపాయల బహుమానాన్ని ఈదీ ఫౌండేషన్ తిరస్కరించింది. పాకిస్థాన్ కు చెందిన ఈ సంస్థే గీతకు ఆశ్రయం కల్పించింది. సోమవారం భారత్ కు చేరుకున్న గీత.. ప్రధాని నరేంద్ర మోదీని కలిసింది.ఈ సందర్భంగా ఉద్వేగభరితుడైన మోదీ.. కంటికిరెప్పలా గీతను చూసుకున్నందుకు ధన్యవాదాలంటూ ఈదీ ఫౌండేషన్ చైర్మన్ సతీమణి బిల్కిస్ బానో ను అభినందించారు. ‘భారత పుత్రికకు విూరు అందించిన సాయం వెలకట్టలేనిదే అయినప్పటికీ విూ ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు మా వంతు సాయంగా కోటి రూపాయలు ప్రకటిస్తున్నాం’ అని మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మోదీ విరాళాన్ని తిరస్కరిస్తున్నట్లు ఈదీ ఫౌండేషన్ చైర్మన్ అబ్దుల్ సత్తార్ ఈదీ మంగళవారం ఒక ప్రకటన చేశారు. ఫౌండేషన్ అధికార ప్రతినిధి అన్వర్ ఖాజ్మీ.. ఈదీ నిర్ణయాన్ని విూడియాకు తెలిపారు. ‘ మోదీ ఆదరణకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. కానీ ఆయన ప్రకటించిన విరాళాన్ని స్వీకరించలేం’ అని ప్రకటనలో పేర్కొన్నారు. 15 ఏళ్ల కిందట భారత్ నుంచి తప్పిపోయిన బాలిక గీతను కరాచీ కేంద్రంగా పనిచేస్తున్న ఈదీ ఫౌండేషన్ అక్కున చేర్చుకుంది. హిందూ దేవుళ్లను పూజించుకునే అవకాశాన్ని కల్పించి మురిపెంగా పెంచుకుంది. బజరంగీ భాయిజాన్ సినిమా తర్వాత వెలుగులోకి వచ్చిన గీత కథ వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. గీత వెంట ఇండియాకు వచ్చిన వారిలో ఈదీ సతీమణి బిల్కిస్ బానోతోపాటు ఆమె మనవరాళ్లు సాబా, సాద్ ఈదీలు కూడా ఉన్నారు. వీరు ఇప్పటికే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు ప్రముఖుల్ని కలుసుకున్నారు. డీఎన్‌ఏ ఫలితాల అనంతరం తల్లిదండ్రులు ఎవరో నిర్ధారణ అయ్యేంతవరకు గీత ఇండోర్ లోని ట్రైనింగ్ సెంటర్ లో ఉంటుంది.