నువ్వా నేనా ! నరాలు తెగే ఉత్కంఠ
నువ్వా నేనా అన్నట్టు సాగింది సెమీస్ సమరం. బంతిబంతికీ నరాలు తెగే ఉత్కంఠ రేపింది. ఇరుజట్ల మధ్య గెలుపు ఊగిసలాడింది. దురదృష్టాన్ని మోసుకుని తిరిగే సఫారీలు ఎప్పటిలాగే చివర్లో చతికిలపడ్డారు. ఈజీ క్యాచ్ లను నేలపాలు చేశారు. కళ్లుమూసుకుని చేసే రన్నవుట్ల దగ్గర విపరీతంగా టెన్షన్ పడ్డారు. కీలక సమయంలో చేసిన ఫీల్డింగ్ పొరపాట్లు- సఫారీలను సఫా చేశాయి. పోరాడినప్పటికీ చేజేతులా ఓటమి కొనితెచ్చుకున్న సౌతాఫ్రికా ఆటగాళ్లు ఉద్వేగంతో కన్నీళ్లపర్యంతమయ్యారు. మొదట్నుంచీ ఎక్కడా తడబడని న్యూజిలాండ్- చివరికి వరకు ఆత్మవిశ్వాసంతో ఆడింది. మొదటి పవర్ ప్లేని బీభత్సంగా ఉపయోగించుకుంది. మెక్ కల్లమ్ కల్లోల బ్యాటింగ్ గట్టి పునాది వేసింది. ఆ తర్వాత ఎలియట్ ఎదురుదాడి- అండర్సన్ అరివీర భయంకరైన ఆట- వెరసి కివీస్ ని విజయతీరాలకు చేర్చాయి. వాల్డ్ కప్ లో మొదటిసారి ఫైనల్ చేరిన న్యూజిలాండ్.. ఎల్లుండి జరిగే రెండో సెమీస్ విజేతతో పోటీపడుతుంది.