నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్, సచివాలయాలకు అంబేద్కర్ పేరు పెట్టాలి

అంబేద్కర్, బీసీ సంక్షేమ సంఘాలు

బిచ్కుంద సెప్టెంబర్ 15 (జనంసాక్షి) భారత నూతన పార్లమెంట్ భవనానికి, రాష్ట్ర నూతన సచివాలయానికి ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత పేరును పెట్టాలని అంబేద్కర్ సంఘం కామారెడ్డి జిల్లా శాఖ మరియు బహుజన విద్యావంతుల వేదిక, అంబెడ్కర్ సేవ సమితి, బీసీ సంక్షేమ సంఘాలు గురువారం నాడు జిల్లా కేంద్రంలో డిమాండ్ చేశాయి. ఈ సందర్బంగా అంబేద్కర్ సంఘము జిల్లా అధ్యక్షుడు ఆకుల బాబు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా అంబేడ్కర్ జన్మదినాన్ని జ్ఞాన దినోత్సవంగా జరుపుకొని మనదేశ జ్ఞానవంతుణ్ణి గౌరవిస్తుందని, అలాంటి నాయకున్ని మన భారత దేశంలో ఒక కులానికో ఒక జాతికో పరిమితం చేసి ప్రపంచం ముందు మన దేశ పరువును మనమే తీసుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగాన్ని రాసి భారత పరిపాలన విభాగాన్ని ఒక సక్రమ మార్గంలో నడిపించడానికి ప్రధాన కారణమైనటువంటి మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ పేరును నూతనంగా నిర్మిస్తున్నటువంటి పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టకుండా తాత్సారం చేస్తుంటే బిజెపి నాయకుల వివక్ష కనిపిస్తోందని ఆగ్రహము వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వానికి నిజంగా డాక్టర్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ పట్ల భారత బహుజనుల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పట్ల గౌరవం, అభిమానం అంటే నూతనంగా నిర్మిస్తున్నటువంటి పార్లమెంట్ భవనానికి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ పేరును పెట్టాలని డిమాండ్ చేశారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న సచివాలయానికి అంబెడ్కర్ పేరు పెట్టి అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందుకు కృతజ్ఞత తీర్చుకోవాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు కొత్తపల్లి మల్లన్న మాట్లాడుతూ పార్లమెంటు మరియు రాష్ట్రంలో నిర్మిస్తున్న సచివాలయానికి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ పేరును పెట్టాలని సూచించారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అంబేద్కర్ పేరు పెట్టకపోతే గ్రామ గ్రామంలో బిజెపి నాయకులను అడ్డుకొని నిలదీస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంగి రాజలింగం, బహుజన విద్యావంతుల వేదిక రాష్ట్ర కోఆర్డినేటర్ రాజవర్ధన్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సాపశివరం, అంబేద్కర్ సేవా సమితి రాష్ట్ర కోఆర్డినేటర్ మంగలి చంద్రమౌళి, అంబేద్కర్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బొగడమీద సాయిలు, అంబేద్కర్ సేవా సమితి జిల్లా నాయకులు కొండ సంజీవ్, భూపతి, బహుజన నాయకులు బాలరాజు, స్వామి మరియు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.