నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని.. కఠినంగా అమలుచేస్తాం
– ఆరాచక వ్యవస్థకు అంతం పలుకుతాం
– ప్రజలకు ఎలాంటి బాధలు లేకుండా చేస్తాం
– గ్రామాలను అద్భుతంగా తీర్చిదిద్దుతాం
– 24గంటల విద్యుత్‌ను అందిస్తున్నాం
– కాంగ్రెస్ సభ్యులు అసత్యాలు మాట్లాడటం సరికాదు
– అసెంబ్లీలో తెలంగాణ సీఎం కేసీఆర్
– కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు వ్యాఖ్యలపై మండిపడ్డ కేసీఆర్
– సభ్యులు అసత్య వ్యాఖ్యలు చేయొద్దన్న సీఎం
హైదరాబాద్, ఫిబ్రవరి23(జనంసాక్షి) : నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని అమల్లోకి తెచ్చామని, ఈ చట్టాన్ని కఠినంగా అమలు చేయబోతున్నామని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. శనివారం అసెంబ్లీలో బడ్జెట్‌పై జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. పంచాయతీలకు తగిన నిధులు ఇవ్వలేదని అన్నారు. వడ్డీ మాఫీ విషయంలోనూ రైతులు ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రైతుబంధు పధకంతో పాటు రైతులను ఆదుకోవాలని, అలాగే ఐఆర్ కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్నారని శ్రీధర్ బాబు సభలో ప్రస్తావించారు. అదేవిధంగా మహాదేవ్‌పూర్, కాటారం, పెద్దంపేట్ సబ్‌స్టేషన్ల పరిధిలో 24 గంటల కరెంట్ సరఫరా కావడం లేదని పేర్కొన్నారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందిస్తూ.. శ్రీధర్‌బాబు గాలి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 24 గంటల కరెంట్ సరఫరా విషయంలో ఆయన అసత్యం పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాదేవ్‌పూర్, కాటారం, పెద్దంపేట్ సబ్‌స్టేషన్ల పరిధిలో గత 20రోజుల రికార్డులు పరిశీలిస్తే 24 గంటల కరెంట్ సరఫరా అవుతోందని తేలిందన్నారు. అధికారులను సంప్రదించి, రికార్డులను చూసిన తర్వాతే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నానని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సాంకేతిక సమస్య వల్లే గంటో, అరగంటనో కరెంట్ పోతదని, అది ముఖ్యమంత్రి ఇంట్ల కూడా జరుగుతుందని, అసత్యాలు చెప్పడం మంచిది కాదని శ్రీధర్‌బాబుకు కేసీఆర్ చురకలంటించారు. మరోవైపు పంచాయతీరాజ్ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. పంచాయతీలను పటిష్టం చేసేందుకే.. కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చామన్నారు. బడ్జెట్ లో పంచాయతీలకు నిధులు కేటాయించలేదంటూ ప్రతిపక్ష సభ్యులు అవాస్తవాలు మాట్లాడడం సరికాదన్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని, కాంగ్రెస్ హయాంలో అసలు సోలార్ విద్యుత్ ప్రారంభం కాలేదన్నారు. పెండింగ్ లో ఉన్న బకాయిలను వందశాతం వసూలు చేస్తామన్నారు. పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ నాశనం చేసిందని వ్యాఖ్యానించారు. జగిత్యాల మున్సిపాలిటీకి రూ.2కోట్ల బకాయిలు గత కాంగ్రెస్ ప్రభుత్వానిదేని సీఎం అన్నారు. గ్రామ పంచాయతీలకు ఆర్థిక సమస్యలు లేకుండా చూస్తామని హావిూ ఇచ్చారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన సబ్ స్టేషన్‌ల వల్లే విూరిప్పుడు 24గంటల విద్యుత్ ఇవ్వగలుగుతున్నారని శ్రీధర్‌బాబు అనడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ హయాంలో ఓ లెక్కపత్రం లేదని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అనంతరం అధికారంలోకి వచ్చాక.. ఎంతో కష్టపడి పట్టుదలతో 24గంటల విద్యుత్‌ను అందించేందుకు కృషి చేశామన్నారు. మా కృషి ఫలించి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 24గంటల విద్యుత్ అందుతుందని సీఎం తెలిపారు. కాంగ్రెస్ హయాంలో తెలంగాణలో సోలార్ విద్యుత్తే లేదని సీఎం అన్నారు. రాష్ట్రంలో 3600మెగావాట్ల సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నామన్నారు. సోలార్ పవర్ ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ రెండోస్థానంలో ఉందని, 40నెలల్లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను నిర్మించామని, తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణది అగ్రస్థానంలో ఉందని కేసీఆర్ స్పష్టం చేశారు.