నూతన సరపంచులకు శుభవార్త

` పెద్ద గ్రామాలకు రూ.10లక్షలు .. చిన్న గ్రామలకు రూ.5 లక్షలు
` స్పెషల్‌ డెవలప్‌ ఫండ్‌ కింద ఎంపీలు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు సంబంధం లేకుండా నేరుగా గ్రామాలకు నిధులు
` గ్రామాల అభివృద్దికి నడుం బిగించాలని పిలుపు
` గ్రామాల అభివృద్దితోనే దేశాభివృద్ది సాధ్యమని సూచన
` కేంద్రం నుంచి మార్చిలోగా రూ.3వేల కోట్లు
` కొడంగల్‌లో సర్పంచ్‌ల సన్మాన కార్యాక్రమంలో సీఎం రేవంత్‌ వెల్లడి
` సోయిలేని మాటలు.. స్థాయిలేని విమర్శలు
` నేనున్నంత కాలం..కేసీఆర్‌కు అధికారం కల్లే
` రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ఇక గత చరిత్రే
` వరుస ఓటములు ఎదురయినా సిగ్గురాలేదా?
` నన్నూ..నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినా పట్టించుకోలే..
` కేసులు పెట్టి జైలుకు తోసినా లాభం లేదని మిన్నకున్నా
` ఫామ్‌హౌజ్‌నే జైలుగా మార్చుకుని ఉంటున్నావని గుర్తుంచుకో
` నీలా పాస్‌పోర్టు బ్రోకర్‌ దందా చేసి పైకి రాలేదు
` సొంత చెల్లిని మెడబట్టి గెంటిన కేటీఆర్‌ నాపై విమర్శలా
` నీలాంటి వారిని చాలామందిని చూసా..గుర్తుంచుకో
` కిందిస్థాయి నుంచి వచ్చి ముఖ్యమంత్రినయ్యా..
` కొడంగల్‌ సభలో కెసిఆర్‌పై సీఎం ఘాటు విమర్శలు
మహబూబ్‌నగర్‌(జనంసాక్షి): గ్రామాల అభివృద్దికి కొత్త సర్పంచ్‌లు తమవంతుగా కృషి చేయాలని, వారికి ప్రభుత్వం తోడ్పాటుగా ఉంటుందని సిఎం రేంవత్‌ రెడ్డి అన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం సర్పంచ్‌లకు నేరుగా నిధులు అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. కొడంగల్‌ నియోజకవర్గం పరిధిలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం.. సర్పంచ్‌లకు శుభవార్త చెప్పారు. గ్రామాల అభివృద్ధి కోసం సర్పంచ్‌లకు నేరుగా నిధులు అందిస్తామని చెప్పారు. పెద్ద గ్రామాలకు రూ. 10 లక్షలు, చిన్న గ్రామాలకు రూ. 5 లక్షలు చొప్పున ఇస్తామన్నారు. సర్పంచ్‌లకు స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ కింద నిధులు ఇస్తామని సీఎం తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు సంబంధం లేకుండా నిధులు ఇస్తామని తెలిపారు. అలాగే గ్రామాల్లో అర్హులందరికీ రేషన్‌ కార్డులు జారీ చేస్తాని సీఎం ప్రకటించారు. కేంద్రం నుంచి 3వేల కోట్లు రావాల్సి ఉందని, మార్చిలోగా వాటిని తెచ్చే బాధ్యత తనదని, వాటిని నేరుగా గ్రామాలకు అందచేస్తామని అన్నారు. ఈ నిధులతో గ్రామాల్లో పనులు మొదలు పెట్టాలన్నారు. విూ సహకారం వల్లే నేను ఇంతటివాడిని అయ్యాను. 2009 నుంచి నన్ను విూ భుజాలపై మోశారు. కొడంగల్‌ను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతా. గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుంది. గ్రామాల్లో వివక్ష లేకుండా పరిపాలన సాగాలి. పార్టీలు.. పంతాలకు పోకుండా కలిసికట్టుగా పనిచేయాలి. గ్రామాల అభివృద్ధికి పాటుపడేలా సర్పంచ్‌లు ఉండాలి. ప్రజలకు ఉన్నతమైన, నాణ్యమైన సేవలు అందించాలి. పార్టీలకు అతీతంగా గ్రామాలు అభివృద్ధి కావాలని నూతన సర్పంచ్‌లకు సీఎం రేవంత్‌ సూచించారు. నూతన సంవత్సరంలో గ్రామాలకు ప్రత్యేక అభివృద్ధి నిధులు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. పంచాయతీలకు యథావిధిగా వచ్చే నిధులు కాకుండా చిన్న గ్రామాలకు రూ.5లక్షలు, పెద్ద గ్రామాలకు రూ.10లక్షలు చొప్పున ముఖ్యమంత్రి నిధి నుంచి ప్రత్యేక అభివృద్ధి నిధులు కేటాయిస్తామని ప్రకటించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాట నిలబెట్టు కునేందుకు గ్రామాల్లో సదుపాయాల కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని సర్పంచ్‌లకు సూచించారు. గ్రామాల్లో దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ప్రత్యేక అభివృద్ధి నిధులు ఉపయోగించాలన్నారు.కొడంగల్‌ నియోజకవర్గాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. ప్రతి గ్రామం, తండాకు రోడ్లు పూర్తి చేస్తాం. గుడి, బడి, తాగునీరు, పేదలకు ఇళ్లు, రేషన్‌ కార్డులు అందిస్తాం. నిరుద్యోగుల కోసం ఇండస్టియ్రల్‌ పార్కును అభివృద్ధి చేస్తాం. నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు.. గ్రామాల్లో ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా ప్రజా సేవ చేయాలి. దేశ పునాదులు గ్రామాల్లో ఉన్నాయని గాంధీజీ చెప్పారు. గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. పేదలకు పథకాలు చేరినప్పుడే నిజమైన పాలన అందుబాటులోకి వస్తుంది. కొడంగల్‌ను ఆదర్శ నియోజకవర్గంగా నిలబెట్టిన నాయకులను అభినందిస్తున్నా. ఇక్కడి సమస్యల పరిష్కారానికి మా సోదరుడు తిరుపతిరెడ్డిని అందుబాటులో ఉంచా. ఎన్నికలు ముగిశాయి.. ఇక ఎలాంటి రాజకీయాలు లేవు. ఎన్నికల్లో పోటీ చేసినప్పుడే పార్టీలు, పంథాలు ఉండాలి. రాష్టాన్రికి నాయకత్వ వహిస్తున్న మనం అందరినీ కలుపుకొని పోదాం అని అన్నారు. నియోజకవర్గంలోని గ్రామాలు, తండాల్లో ఎలాంటి సమస్యలు ఉండకూడదని సీఎం అన్నారు. కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.
నేనున్నంత కాలం.. కేసీఆర్‌కు అధికారం కల్లే
:తాను రాజకీయాల్లో ఉన్నంతకాలం కేసీఆర్‌, ఆయన కుటుంబానికి అధికారం దక్కనివ్వనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శపథం చేశారు. మంతరిగా, కేంద్రమంత్రిగా, సిఎంగా పదేళ్లు పనిచేసిన కెసిఆర్‌ నాలుగు మంచి మాటలు చెప్పకుండా తోలు తీస్తానంటూ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. నీలాగా తిట్టుడు మొదలు పెడితే తట్టుకోలేవు కెసిఆర్‌ అంటూ హెచ్చరికలు చేశారు. నారాయణపేట జిల్లా కోస్గిలో ఏర్పాటు చేసిన సర్పంచ్‌ల సన్మాన సభలో సీఎం మాట్లాడుతూ.. కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘రెండేళ్ల తర్వాత కేసీఆర్‌ బయటకు వచ్చి తోలు తీస్తానంటున్నారు. కేసీఆర్‌వి సోయిలేని మాటలు.. స్థాయిలేని విమర్శలు. గతంలో నన్ను, నా కుటుంబాన్ని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారు. పగ సాధించడం మెదలుపెడితే రాష్టాన్రికి నష్టం జరుగుతుందని వదిలిపెట్టా. నేను ప్రమాణం చేసినప్పుడే కూలబడ్డారు.. ఇంతకంటే పెద్ద శిక్ష ఇంకేం ఉంటుంది. ఫాంహౌస్‌ను కేసీఆర్‌ బందీఖానాగా మార్చుకుని చుట్టూ పోలీసులున్నారు. చర్లపల్లికైనా, చంచల్‌గూడ జైలుకు పంపినా అదే పరిస్థితి ఉంటుంది కదా. నన్ను గెలకవద్దు.. మర్యాదగా ఉండదని మాట్లాడటం లేదు. నల్లమల నుంచి వచ్చి జడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ తర్వాత సీఎం అయ్యా అంటూ ఘాటైన విమర్శలు చేశారు. పాలమూరు రంగారెడ్డి, ఎస్‌ఎల్‌బిసి వంటి ప్రాజెక్టులను పండబెట్టిన ఘనుడవని విమర్శించారు. స్థిరాస్తి వ్యాపారం దందా చేస్తున్నానని కేసీఆర్‌ ఆరోపిస్తున్నారు. ఇదేం పాస్‌పోర్టు బ్రోకర్‌ వ్యవహారం కాదు. దుబాయ్‌ పంపుతామని ఎవరినీ మోసం చేయలేదు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంతో రాష్టాన్రికి ఆదాయం వస్తుంది. మరో వైపు.. హైదరాబాద్‌లో స్థిరాస్తి వ్యాపారం పడిపోయిందని కేటీఆర్‌ చెబుతున్నారు. కక్ష సాధింపు రాజకీయాలు చేయం.. ఎవరి పాపాన వారు పోతారని వదిలేశాం. మైకు ముందుకు రావట్లేదు.. దాక్కున్నానని కేటీఆర్‌ ఆరోపిస్తున్నారు. నువ్వెంత.. నీ స్థాయి ఎంత? తండ్రి పేరు చెప్పుకొని బతుకుతున్నావు. ఏపీలో చదువుకున్న కేటీఆర్‌కు తెలంగాణ గురించి ఏం తెలుసు? మా ఊరికొస్తావా? విూ ఊరికి రావాలా? ఎవరు భయపడుతున్నారో తెలుస్తుంది. గజ్వేల్‌లో లక్షలాది మంది కార్యకర్తలతో నిరసన చేపడితో పాతాళానికి వెళ్లారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 119 సీట్లు అయితే.. 2/3 వంతు మెజార్టీతో 80కి పైగా సీట్లతో మళ్లీ మేమే అధికారంలోకి వస్తాం. ఒకవేళ 153 సీట్లయితే.. 100కి పైగా స్థానాల్లో విజయం సాధించి రెండో సారి ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు రాసి పెట్టుకోండి.. ఇదే నా సవాల్‌. నేను రాజకీయం చేసినంత కాలం కాలకూట విషం లాంటి కేసీఆర్‌ కుటుంబాన్ని అధికారంలోకి రానివ్వను.. ఇదే నా శపథం. కొడంగల్‌ బిడ్డగా ఈ గడ్డపై నుంచి శపథం చేస్తున్నా. నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం… వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ కుటుంబానికి అధికారమనేది కల. భారత రాష్ట్ర సమితి, కేసీఆర్‌ చరిత్ర ఖతమే. విూ పార్టీకి, విూకు భవిష్యత్తు లేదు. బీఆర్‌ఎస్‌, కేసీఆర్‌ గతమే.. తెలంగాణ భవిష్యత్తు కాంగ్రెస్‌. గత చరిత్రతో ఒరిగేదేవిూ లేదని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిరచాం. పార్లమెంట్‌ ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చాం. కంటోన్మెంట్‌లో బండకేసి కొట్టాం. జూబ్లీహిల్స్‌ ఎన్నికల్లో బోరబండలో బండ కింద పాతిపెట్టినం. 12,726 పంచాయతీల్లో 8,335 మంది సర్పంచ్‌లను గెలిపించుకున్నాం. ఇన్ని సార్లు ఓడిరచినా.. ఇంకా నాదే పైచేయి అంటారా? 2029 అసెంబ్లీ ఎన్నికల్లో తేల్చుకుందాం రండి. ఇప్పటికైనా కేసీఆర్‌ వయసును గౌరవిస్తాం. ఈనెల 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. విూరు చెప్పిన అన్ని అంశాలపై చర్చిద్దాం రండి. అసెంబ్లీలో చర్చించకుండా ఫాంహౌస్‌లో నిద్రపోయి.. ఖాళీగా ఉన్నప్పుడు పార్టీ ఆఫీసుకు వచ్చి ప్రెస్‌విూట్‌లు పెట్టడం కాదు. నిజమైన చర్చ అసెంబ్లీలో చేద్దాం.. ఎవరు ఏం మాట్లాడుతున్నారో ప్రజలు వింటారని కేసీఆర్‌ , ఆయన కుటుంబంపై నిప్పులు చెరిగారు. అత్యంత ఘాటైన పదజాలంతో విరుచుకుపడిన సీఎం, తనను , తన కుటుంబాన్ని గతంలో కేసీఆర్‌ వేధించారని, జైల్లో పెట్టి ఇబ్బందులకు గురిచేశారని గుర్తు చేసుకున్నారు. ఆయన చేసిన పాపాలే ఆయనను వెంటాడుతున్నాయి. జైల్లో పెట్టి ప్రభుత్వ ఖర్చుతో ఆయనకు తిండి పెట్టడం ఎందుకని నేను ఒక్క కేసు కూడా పెట్టకుండా వదిలేశాను. కానీ ఇప్పుడు సోయి లేకుండా మాట్లాడుతూ తోలు తీస్తా అని స్థాయి లేని మాటలు మాట్లాడుతున్నారని రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్‌ వ్యాఖ్యలకు ప్రతిసవాల్‌ విసురుతూ, ‘రా.. నీ చింతమడకకు రమ్మంటావా లేక కొడంగల్‌ వస్తావా? ఎక్కడైనా తేల్చుకుందాం. మటన్‌ కొట్టు మస్తాన్‌ దగ్గర పొట్టేలును కోసిన తర్వాత తోలు తీసే పని కేసీఆర్‌కు ఇమ్మని చెప్పాను. సాయంత్రం వెళ్లేటప్పుడు దావత్‌ కోసం ముక్కో బొక్కో ఇచ్చి పంపమని సూచించాను. నన్ను గెలికితే నేను మాట్లాడటం మొదలుపెడితే నువ్వు ఉరి వేసుకుని చస్తావు. మల్లన్న సాగర్‌లో పడి చావాల్సిందే అని అన్నారు. ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందనే భయంతో సొంత బిడ్డను, అల్లుడిని వెళ్లగొట్టాడని, సొంత చెల్లెలిని పండుగకు కూడా ఇంటికి పిలవలేని వ్యక్తి తన గురించి మాట్లాడటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. ‘పిడకల మూతి బోడిలింగం లాంటి కేటీఆర్‌, నువ్వు, నీ జాతి అంతా వచ్చినా నేను భయపడను. విూ రాజకీయం ఏంటో చూపిస్తా, రాసి పెట్టుకో‘ అని సవాల్‌ విసిరారు. సమావేశంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌ రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి , ఇతర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.