నేటినుంచి గుంటూరులో ఘనవ్యర్థాలపై సదస్సు

గుంటూరు,నవంబర్‌21(జ‌నంసాక్షి): ఈనెల 22 నుంచి 24వ తేదీ వరకు గుంటూరులో పర్యావరణ సదస్సు నిర్వహించనున్నారు. ఘనవ్యర్థాల నిర్వహణపై 8వ అంతర్జాతీయ సదస్సును గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈనెల 22 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించనున్నారు. 25 దేశాల నుంచి 750 మంది నిపుణులు, ప్రతినిధులు సదస్సుకు హాజరుకానున్నారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ఈ మేరకు ఓ ప్రకటనలో తెలిపింది. పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థాల నిర్వహణ ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని పేర్కొంది. ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్‌, మైక్రోప్లాస్టిక్‌, ప్రమాదకర, ఎలక్టాన్రిక్‌, బయోమెడికల్‌, నిర్మాణాల-కూల్చివేతల వ్యర్థాలు తదితరాలపై ఇందులో చర్చిస్తారని వివరించింది. సదస్సును ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, ప్రదర్శనలను పురపాలక మంత్రి పి.నారాయణ ప్రారంభిస్తారని వివరించింది.