నేటి అంబేడ్కర్‌ జయంతికి భారీగా ఏర్పాట్లు

ఆయన ఆశయసాధనకు పాలకుల తూట్లు
నివాళి కార్యక్రమాలతో సరిపెడుతున్న ప్రభుత్వాలు
న్యూఢల్లీి,ఏప్రిల్‌13(జ‌నంసాక్షి): అంబేడ్కర్‌ జయంతి ఉత్సవాలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేం దుకు ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్న వేళ ఆ మహానుభావుడి కృషిని, ఆయన సేవలను తలచుకునే అవకాశం ప్రజలకు కలిగింది. ఏప్రిల్‌ 14 డాక్టర్‌ అంబేద్కర్‌ జయంతి ద్వారా అణగారిన వర్గాలకు మంచి చేస్తామన్న బలమైన ఆకాంక్షను చాటాలి. అణచివేత నుంచి ఉద్భవించిన అద్బుతమైన మేధావి అంబేడ్కర్‌. ఆయన రాజ్యాంగ నిర్మాణానికి దోహదపడిన తీరు భారత్‌ పురోభివృద్దికి వేసిన బాటలుగా చూడాలి. అయితే ఆయన పేరుతో రాజకీయాలు చేయడం కన్నా ఆయన మార్గాలను అందుకుని ముందుకు నడవాల్సి ఉంది. డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ ఈ తరానికి సైతం ఆదర్శప్రాయుడు. ఆయన చూపిన మార్గం ఓ కులానికో లేదా మతానికో సంబంధించిన వ్యవహారంగా చూడరాదు. ఆయనకు భారీ విగ్రహాలను పెట్టి పూజలు చేయడం వల్ల దళితులు ఇతర అణగారిన వర్గాలు బాగుపడరు. ఈ వర్గాలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకుని వెళ్లడమే ఆయనకు నిజమైన నివాళిగా బావించాలి. అయితే విగ్రహాలను పూజించడం వరకే కార్యక్రమాల ను పరిమితం చేయకుండా ఆయన చేసిన సేవలను గుర్తుంచుకుని శాశ్వత కార్యక్రమాలను ముందుకు తీసుకుని వెల్లాలి. అసమానతలు లేని సమాజం కోసం ఎలాగైతే అంబేడ్కర్‌ పరితపించారో అందుకు అనుగుణంగా పనిచేయాలి. పాలకవర్గాలు ఏటా ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తున్నాయి. భక్తి ప్రపత్తులతో ఆ మహానేతకు నివాళులర్పిస్తున్నాయి. దళితుల కోసం అనేక పోరాటాలు చేసి, వారి సంక్షేమం కోసం అహరహం పనిచేసిన దళిత బాంధవుడు డాక్టర్‌ అంబేద్కర్‌ను స్మరించుకునేందుకు, ఇటీవలి కాలంలో ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రధాని మోడీ అంబేడ్కర్‌ ఆశయాలను ముందుకు తీసుకుని వెల్లడంలో బాగా శ్రమిస్తున్నారు. ఆయనకు దక్కాల్సిన ఖ్యాతి దక్కలేదన్న మోడీ పదేపదే చెబుతున్నారు. అంబేడ్కర్‌ కేవలం దళితులకే ఆరాధ్యుడు కాదన్న వాదన నూటికి నూరుపాళ్లు నిజం. ఆయన ఓ మేధావి. ఆయన చూపిన మార్గం అనుసరించి ఉంటే దేశం మరోరకంగా ఉండేది. ఆయన ఆర్థిక ప్రణాళికలను అమలు చేసి ఉంటే దేశ పరిస్థితులు మరో రకంగా ఉండేవి. కానీ ఇప్పటికైనా అంబేడ్కర్‌ భావజాలంలోని మంచిని గ్రహించి ముందుకు సాగితే మంచిది.
ఆయన చూపిన బాటలో రాజ్యాంగ పరిధులకు లోబడి ముందుకు సాగితే నవభారతాన్ని నిర్మించుకోవచ్చు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తు కార్యక్రమాలకు ప్రధాని మోడీ ఆదేశించారు. ఇందులో గ్రామస్థులు అందరినీ భాగస్వాములను చేయాలని అన్నారు. సర్పంచ్‌ల నాయకత్వంలో దీనిని ముందుకు తీసుకుని వెళ్లాలన్న ఆలోచన మంచిదనేచెప్పాలి. తెలుగు రాష్ట్ర పాలకులు అందరికంటే ఒక అడుగు ముందుకేశారు. అంబేద్కర్‌ విగ్రహాలను భారీ స్ధాయిలో ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. అమరావతిలో 125 అడుగుల ఎత్తు ఉన్న అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటుచేయాలని గత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయించారు. తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా హైదరాబాద్‌లో అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటుచేయాలని ఆదేశిస్తూ, ఆ మేరకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. దళితుల కోసం తుది శ్వాస వరకూ పోరాడిన అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటుచేయడం ద్వారా, ఆయనకు నివాళులర్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలు, కృషి అభినందనీయమే. అసమానతలు లేని సమజాం కోసం కలలు కన్న అంబేడ్కర్‌ ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్లాలి. అణగారిన వారికి అండగా నిలవాలి. వారికి అన్న రంగాల్లో సమాన హక్కులు కలిగేలా చూడాలి. అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం జీవితాంతం పరితపించిన అంబేడ్కర్‌ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న నేతలుగా నిరూపించు కోవాలి. కులరహిత సమాజం కోసం పాటుపడాలి. అంబేడ్కర్‌ ఆశయాలను కేవలం దళితులకే ఆపాదించకుండా ఇది ప్రతి ఒక్కరి బాధ్యతగా చూడాలి. ఆయన చూపిన మార్గంలో పయనిస్తే అసమానతలు లేని సమాజాన్ని నిర్మించుకోవచ్చు.