నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు

` బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్‌
` నీట్‌ లీకేజీపై చర్చకు విపక్షాల పట్టు
` బడ్జెట్‌లో మినహాయింపులు, సెక్షన్‌ 80సీ, 80డీలో మార్పులపై ఉత్కంఠ
` మోదీ 3.0 బడ్జెట్‌పై మధ్య తరగతి, వేతనజీవుల ఆశలు
హైదరాబాద్‌(జనంసాక్షి):పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం పార్లమెంట్‌కు బడ్జెట్‌ సమర్పించనున్నారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం వేగంగా పెరుగుతూ వస్తున్నది. మోదీ 3.0 ప్రభుత్వంపై ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌పై మధ్య తరగతి, వేతనజీవులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. ఈసారి ఏమైనా ఉపశమనం కల్పిస్తారా? లేదా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత కొద్ది సంవత్సరాలుగా పన్ను స్లాబ్‌లో తగ్గింపులు, మినహాయింపుల్లో గణనీయంగా ఏవిూ మార్పులు కనిపించలేదు. ఈ క్రమంలో సారైనా పన్ను శ్లాబ్‌లలో మార్పులను ఆశిస్తున్నారు.దీంతో బడ్జెట్‌లో సెక్షన్‌ 80సీలో మార్పులు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆదాయపు పన్ను సెక్షన్‌ 80అ కింద, సుకన్య సమృద్ధి యోజన, ఈపీఎఫ్‌, పీపీఎఫ్‌, నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్‌, ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌, నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ మొదలైన పథకాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా విూరు రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందుతున్నారు. ఈ సారి బడ్జెట్‌లో రూ.2 లక్షల నుంచి రూ.3లక్షల వరకు మినహాయింపులను పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదే జరిగితే దేశంలోని కోట్లాది మంది పన్ను చెల్లింపుదారులకు భారీ ప్రయోజనం చేకూరనున్నది. గత కొన్నేళ్లుగా ఆదాయపు పన్ను చట్టంలోని 80సీలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.ఈ క్రమంలో గతకొంతకాలంగా పన్ను మినహాయింపులు పెంచాలనే డిమాండ్‌ ఉన్నది. బడ్జెట్‌కు ముందు జరిగిన భేటీల్లో 80సీ కింద మినహాయింపులు పెంచాలని సీఏ ఇన్‌స్టిట్యూట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను డిమాండ్‌ చేశాయి. ఇదే కాకుండా 80డీ కింద ఆరోగ్య బీమాపై ప్రీమియంపై పన్నును కూడా రెట్టింపు చేసే అవకాశం ఉన్నది. 80డీలో కొద్ది సంవత్సరాలుగా ఎలాంటి మార్పులు జరుగలేదు. ఈ సెక్షన్‌లోనూ మినహాయింపులను పెంచాలని కేంద్ర ఆర్థిక మంత్రికి వినతులు వచ్చాయి. గత కొన్నేళ్లుగా ఆరోగ్య బీమా ప్రీమియం ప్రతి ఏటా 10`25 శాతం చొప్పున పెరుగుతుండడం గమనార్హం. పన్ను చెల్లింపుదారుల కోరిక మేరకు కేంద్రం బడ్జెట్‌లో ఈసారి మినహాయింపులు ఇస్తుందా? లేదా? మరో రెండురోజుల్లో తేలిపోనున్నది.

డిప్యూటీ స్పీకర్‌ పదవిపై విపక్షాల పట్టు
` అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్షాల డిమాండ్‌
బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో పార్లమెంట్‌లో చేపట్టాల్సిన కార్యాచరణ గురించి చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో ప్రతిపక్ష పార్టీల నేతలు తమ డిమాండ్లను వినిపించారు. పార్లమెంట్‌ వేదికగా తమ గొంతు వినిపించేందుకు అవకాశం ఇస్తామన్న భరోసా కల్పించాలని కోరారు. డిప్యూటీ స్పీకర్‌ను ప్రతిపక్ష సభ్యుల నుంచి ఎంపిక చేయాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు జైరాం రమేశ్‌, కె. సురేశ్‌ కోరారు. నీట్‌ పేపర్‌ లీకేజీపై కాంగ్రెస్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.ఆంధ్రప్రదేశ్‌, బిహార్‌, ఒడిశాలకు ప్రత్యేకహోదా కల్పించాలని వైకాపా, జేడీయూ, బిజేడీ పార్టీల నేతలు డిమాండ్‌ చేశారు. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రామ్‌గోపాల్‌ యాదవ్‌ హిందూ భక్తుల ‘కావిడి యాత్ర’ అంశాన్ని ప్రస్తావించారు. కావిడి యాత్ర జరిగే మార్గంలోని హోటళ్లపై కచ్చితంగా యజమాని పేరు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలోనే వివాదం ప్రారంభమైందన్నారు. ఇలా చేయడం వల్ల తమ వ్యాపారాలు దెబ్బతింటాయని ముస్లిం సామాజిక వర్గానికి చెందిన హోటల్‌ యజమానులు ఆందోళన చేస్తున్నట్లు వివరించారు. దీనిపై ఈ సమావేశాల్లో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.సమావేశం అనంతరం పార్లమెంట్‌ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు విూడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా 44 పార్టీల నుంచి 55 మంది నేతలు సమావేశానికి హాజరైనట్లు చెప్పారు. సభలను సజావుగా నడిపించే బాధ్యత అధికారపక్షంతోపాటు ప్రతిపక్ష నేతలపైనా ఉంటుందన్నారు. పార్లమెంట్‌ నిబంధనలకు లోబడి ఎలాంటి చర్చకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కీలకమైన 24 శాఖలకు సంబంధించి స్టాండిరగ్‌ కమిటీలను ఏర్పాటు చేయాలని, వాటికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ డిమాండ్‌ చేశారు. అంతే కాకుండా వివిధ శాఖల మంత్రులతో ఎంపీలు నేరుగా సంప్రదింపులు జరిపేందుకు వీలుగా సంప్రదింపుల కమిటీలను పునరుద్ధరించాలని అఖిలపక్ష భేటీలో కోరినట్లు ఆయన తెలిపారు.బడ్జెట్‌ సమావేశాలు సోమవారం ప్రారంభమై ఆగస్టు 12 వరకు జరుగుతాయి. మొత్తం 6 బిల్లులను సభలో ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. అందులో 90 ఏళ్లనాటి ఎయిర్‌క్రాఫ్ట్‌ చట్టం కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం మంగళవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. దీనికి ఒకరోజు ముందే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆర్థిక సర్వేను పార్లమెంటు ముందు ఉంచనున్నారు.