నేడు ఈద్-ఉల్-ఫితర్
– సీఎం కేసీఆర్, గవర్నర్ శుభాకాంక్షలు
హైదరాబాద్,జులై 6(జనంసాక్షి): నెలవంక కనిపించని కారణంగా ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్)ను గురువారం జరుపుకోనున్నారు. ఈ విషయాన్ని దిల్లీలోని ఫతేపురి మసీదు ఇమామ్… ముఫ్తీ మహ్మద్ ముకరం అహ్మద్ ప్రకటించారు. రంజాన్ మాస ఉపవాసాలు 7వ తేదీన ముగుస్తాయనీ, అదేరోజు ఈద్ జరుపుతామని చెప్పారు. జామా మసీదు షాహి ఇమామ్… సయ్యద్ అహ్మద్ బుఖారీ కూడా రంజాన్ పండుగ 7న జరుగుతుందని ప్రకటించారు. ఒక్క కేరళలో మాత్రం ముందు నిర్ణయించిన ప్రకారం బుధవారమే ఈ పండగ నిర్వహించుకునున్నారు. రాజధానిలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు గురువారం సెలవు ప్రకటించినట్లు కేంద్రం తెలిపింది. కాశ్మీర్‌లో కూడా బుధవారమే పండుగ జరుపుకున్నారు. ఆఘా సరిహద్దులో సైనికులు పాక్ సైనికులకు స్వీట్లు పంచి శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పర్వదినం సందర్భంగా తెలంగాణ సిఎం కెసిఆర్, గవర్నర్ నరసింహన్‌లు శుభాకాంక్షలు తెలిపారు. మతసామరస్యానికి పండగా నిదర్శనమన్నారు. ముస్లిం సోదరులు ఆయురారోగ్యాలతో సుఖంగఆ ఉండాలని ఆకాంక్షించారు. ఇదిలావుంటే తెలంగాణలో గురువారం సెలవుదినంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 7,8 తేదీలను పండుగ సెలవులుగా, వీటిలో 7వ తేదీని వేతనంతో కూడిన సెలవు దినంగా పేర్కొంటూ ప్రభుత్వం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.గతంలో ఆరో తేదీని రంజాన్‌గా భావించి, 6,7 తేదీలను సెలవు దినాలుగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. నెలవంక కనిపించని కారణంగా మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఇచ్చిన సిఫార్సు మేరకు ప్రభుత్వం సెలవుల్లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వ తాజా నిర్ణయం మేరకు ఈ వారంలో వరుసగా నాలుగు రోజుల పాటు సెలవులు వచ్చాయి. 7, 8 తేదీలు రంజాన్ సెలవు దినాలు కాగా, 9న రెండో శనివారం, 10న ఆదివారం సెలవు కావడంతో వరుసగా నాలుగు రోజులు సెలవులు వచ్చాయి. ఎపి ప్రభుత్వం కూడా రంజాన్ సెలవును ఈ నెల 7కు మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రంజాన్ సెలవును గురువారానికి మారుస్తున్నట్లు కేంద్రం వెల్లడించడంతో.. అదే మార్పు రాష్ట్రంలో కూడా వర్తిస్తుందని జీవోలో పేర్కొన్నారు.




