నేడు ఘనంగా వజ్రోత్సవ ముగింపు వేడుకలు

` ముఖ్య అతిధిగా హాజరు కానున్న సిఎం కేసీఆర్‌
` ఎల్‌బిస్టేడియంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహణ
హైదరాబాద్‌(జనంసాక్షి):రాష్ట్ర వ్యాప్తంగా 8వ నుంచి నిర్వహించిన ‘స్వతంత్ర భారత వజ్రోత్సవాల’ ముగింపు వేడుకలు నేడు ఎల్‌.బి. స్టేడియంలో అత్యంత వైభవోపేతంగా జరుగనున్నాయి. ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్‌ రావు గారు ముఖ్య అతిధిగా హాజరయ్యే ఈ ముగింపు వేడుకలలో పలువురు జాతీయ, అంతర్జాతీయ కళాకారులు పాల్గొని పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శిస్తారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి గారి ప్రసంగంతోపాటు దేశ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న తెలంగాణా సమరయోధుల వారసులను., ఇటీవల పలు అంతర్జాతీయ పోటీలలో మెడల్స్‌ సాధించిన తెలంగాణాకు చెందిన క్రీడాకారులను ఇతర ప్రముఖులను సన్మానిస్తారు. 75 ఏండ్ల స్వతంత్ర భారత చరిత్ర లో నిలిచిపోయే విధంగా దాదాపు మూడు గంటలపాటు అత్యంత అట్టహాసంగా అంగరంగ వైభవంగా ఈ ముగింపు ఉత్సవాలు జరుగనున్నాయి.ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో పేరుగాంచిన ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు శంకర్‌ మహదేవన్‌ మ్యూజికల్‌ కాన్సర్ట్‌, శివమణి సంగీత వాయిద్య విన్యాసం, పద్మశ్రీ పద్మజ రెడ్డి బృందంచే శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు, వార్సీ బ్రదర్స్‌ చే ఖవ్వాలి, స్థానిక కళాకారుల ప్రదర్శనలు ఉంటాయి. ఈ వజ్రోత్సవ ద్విసప్తాహం సందర్బంగా నిర్వహించిన వివిధ కార్యక్రమాలను తెలిపే లఘు వీడియో ప్రదర్శన ఉంటుంది. అనంతరం లేజర్‌ షో తో పాటు భారీ ఎత్తున బాణసంచా ప్రదర్శనలతో వజ్రోత్సవాలు ముగుస్తాయి. దాదాపు 30 వేలమంది ఈ ముగింపు ఉత్సవాలలో పాల్గొనే విధంగా రాష్ట్ర పాలనాయంత్రాంగం ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్‌ చైర్మన్లు, మున్సిపల్‌ కార్పొరేషన్ల మేయర్లు, చైర్మన్లు, డీసీసీబీ చైర్మన్లు, ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్లు, ఎంపిపి లు, జెడ్పిటీసీ లు తదితర ప్రజాప్రతినిధులను ఈ ముగింపు ఉత్సవంలో పాలొనేందుకై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుండి ప్రజాప్రతినిధులు అధికారులను సోమవారం ఎల్బీ స్టేడియంకు చేరవేసేందుకు జిల్లా కలెక్టర్లకు ఏర్పాట్లు చేశారు. దేశానికే ఆదర్శంగా జరిగిన ‘‘స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్వి సప్తాహమ్‌’’ వేడుకలుఆగస్టు 8 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారి చేతుల విూదుగా హెచ్‌ఐసిసి లో ఘనంగా ప్రారంభమైన ‘‘స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు ‘‘ మహాత్మా గాంధీ సహా,స్వాతంత్య్ర పోరాటం లో పాల్గొన్న సమరయోధుల త్యాగాలను నేటి తరానికి అర్థం చేయించిన రెండు వారాల వేడుకలు.. 8 తేదీనుండి నిర్వహించిన కార్యక్రమాల్లో పెద్దఎత్తున ప్రజల భాగస్వామ్యం ఈ సందర్బంగా భారత జాతిపిత మహాత్మా గాంధీ పై నిర్మించిన గాంధీ చలన చిత్రాన్ని రాష్ట్రం లోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల పిల్లలకు ఉచితంగా ప్రదర్శించడం ఈ ఉత్సవాలకై హైలెట్‌ గా నిలిచింది. దాదాపు 23 లక్షల మంది విద్యార్థినీ విద్యార్థులు యువకులు గాంధీ సినిమా ను చూడడం దేశంలోనే మొదటి సారి. ఇంత పెద్ద స్థాయిలో గాంధీ సినిమాను ప్రదర్శించడం దేశానికే ఆదర్శంగా నిలిచింది. దేశంలోని పలు రాష్ట్రాల అధికారులు తెలంగాణ అధికారులను ఇందుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా, ఇంటింటా జాతీయ పతాకం ఎగురవేయాలన్న సి.ఎం కేసీఆర్‌ పిలుపు మేరకు దాదాపు కోటీ ఇరవైలక్షల జాతీయ జెండాలను రాష్ట్రంలోని ప్రతీ ఇంటికి పంపిణి చేసి.. ప్రతి ఇంటి విూద ఎగురవేసి తెలంగాణ ప్రజలు చరిత్ర సృష్టించారు. పూర్తిగా మన రాష్ట్ర నేతన్నలు నేసిన ఈ జాతీయ జండాలను ప్రతీ ఒక్కరు తమ ఇంటిపై ఎగురవేసి జాతీయోద్యమ స్ఫూర్తిని ప్రదర్శించారు. అబిడ్స్‌ నెహ్రూ చౌక్‌ లో సామూహిక జాతీయ గీతాలాపన దేశ చరిత్రలో నిలిచిపోయే వజ్రోత్సవ వేడుక.. స్వతంత్ర భారత మొదటి ప్రధాని విగ్రహం సాక్షిగా అబిడ్స్‌ లోని నెహ్రూ చౌరస్తా లో.. ముఖ్యమంత్రి గారు స్వయంగా పాల్గొని..ఈనెల 16 న,నిర్దేశిత సమయం ఉదయం 11.30 గంటలకు సామూహిక జాతీయ గీతాలాపన చేసి జాతికి స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిల్చారు. ఈ వజ్రోత్సవాల సందర్బంగా ప్రత్యేకంగా స్వతంత్ర వజ్రోత్సవ పార్కులను ఏర్పాటు చేయడం, పెద్ద ఎత్తున హరిత హారంలో పాల్గొని లక్షల సంఖ్యలో మొక్కలు నాటడం, భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కవి సమ్మేళనాలు, ముషాయిరాలనిర్వహణ, రవీంద్ర భారతి తోపాటు అన్ని జిల్లా కేంద్రాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, రంగోలీ లు, పాఠశాల పిల్లలకు వివిధ పోటీలను నిర్వహించడం, స్వేచ్ఛ స్వాతంత్య్ర కాముకులను, ప్రజాస్వామిక వాదులను, ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ సందర్బంగా రాష్ట్ర సాహిత్య అకాడెవిూ, ఎల్బీ స్టేడియంలో గాంధీ ఇజాన్ని తెలిపే ప్రత్యేక పుస్తక ప్రదర్శన అమితంగా ఆకట్టుకుంది. జీహెచ్‌ ఎంసీ, హెచ్‌ ఎండీఏ లు సంయుక్తంగా నేడు గ్రేటర్‌ హైదరాబాద్‌ లోని 75 పార్కుల్లో నిర్వహించిన వజ్రోత్సవ సంగీత విభావరి నగర వాసులను విశేషంగా ఆకట్టు కున్నాయి.

తాజావార్తలు