నేడు పొలాల అమావాస్య.
ఫోటో రైటప్: గౌరమ్మలతో ఊరేగింపు నిర్వహిస్తున్న మహిళలు.(ఫైల్ పోటో)
బెల్లంపల్లి, ఆగస్టు26, (జనంసాక్షి)
గ్రామీణ రైతుల పండగ, పాడి పశువులను పూజించే పండుగ, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు అందరూ చల్లంగా ఉండాలని పల్లె ప్రజానీకం ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించే పండగ పొలాల అమావాస్య. శ్రావణ బహుళ అమావాస్యను పొలాల అమావాస్య అంటారు. స్త్రీలు తమ సౌభాగ్యం కోసం, తమ పిల్లల యోగక్షేమాల కోసం, తమ కుటుంబం కోసం వ్రతాలు ఆచరించడం అనాదిగా వస్తున్న ఆచారం. ఈ పొలాల అమావాస్య వ్రతం ప్రత్యేకంగా సంతాన రక్షణ కోసం నిర్దేశించబడినది. రైతులు తమ వ్యవసాయం తమతో పాటు శ్రమించిన ఎడ్లనుపూజిస్తారు. ఎడ్లు లేని రైతులు మట్టితో ఎడ్ల ప్రతిమలు చేసి పూజిస్తారు. శ్రావణ మాసంలో మద్య, మాంసాలకు దుర్గంగా ఉండి, దైవ చింతనతో ఉండే పల్లె ప్రజానీకం శ్రావణ మాసం ముగింపు సందర్భంగా పొలాల అమావాస్య పండుగ జరుపుకుంటారు. ముఖ్యంగా నేతకాని సామాజిక వర్గానికి ఇది చాలా పెద్ద పండగ. ఈ సామాజిక వర్గానికి చెందిన వారు ఈ పండగను అయిదు రోజుల పాటు జరుపుకోవడం విశేషం. నేతకాని సామాజిక వర్గానికి చెందిన వారు మొదటి రోజు అమావాస్య రోజున ఉపవాసాలు ఉండి పిండివంటలు చేస్తారు. సాయంత్రం మట్టితోఎడ్ల ప్రతిమలను తయారు చేసి చనిపోయిన పెద్దల పేరును తలుచుకొని నూతన వస్త్రాలు పెట్టి పూజిస్తారు. తమ స్వంత ఎడ్లను ముస్తాబు చేసి ఉరేగించి నైవేద్యాలు సమర్పిస్తారు. రెండవ రోజు ఉదయం జంగమయ్యలకు చనిపోయిన పెద్దల జ్ఞాపకర్థం బియ్యం, పప్పులు, ఇతర ధాన్యాలను చేస్తారు. ఇంట్లోని ఎడ్ల ప్రతిమలను స్థానిక చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. మూడవ రోజు ఉదయం నుంచి మహిళలు ఉపవాసాలతో ఉండి మట్టి గౌరమ్మలు (గురుగులు) చేసి పూజిస్తారు. నాలుగవ రోజు కూడా మహిళలు ఉపవాసాలు చేసి గౌరమ్మను ( గురుగులను) పూజిస్తారు. అయిదవ రోజు మహిళలు సామూహికంగా డప్పు చప్పట్లతో, మేళా తలాలతో, డీజే నృత్యాలతో కోలాహలంగా గౌరమ్మలను స్థానిక చెరువుల్లో నిమజ్జనం చేసి నృత్యాలు చేసి పొలాల సంబరాలకు వీడ్కోలు పలుకుతారు.