నేడు యూపిలో తొలిదశ ఎన్నికలు
` 11 జిల్లాల్లో 58 స్థానాలకు ఓటింగ్
` రంగంలో 623 మంది అభ్యర్థులు
లక్నో,ఫిబ్రవరి 9(జనంసాక్షి):ఉత్తర ప్రదేశ్‌లో తొలిదశ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. గురువారం తొలిదశ పోలింగ్జరుగగనుంది. మొదటి దశలో భాగంగా 11 జిల్లాల్లోని 58 స్థానాలకు ఓటింగ్ జరగనుంది. 2.27కోట్ల మంది ఓటర్లు 623 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. రాష్ట్రంలో ఏడు దశల్లో పోలింగ్ జరుగనుండగా.. తొలి దశను గురువారం నిర్వహించనుంది. పశ్చిమ యూపీలోని 11 జిల్లాలు.. ప్రబుద్ధ్ నగర్ (షామ్‌లి), విూరట్, హాపూర్ (పంచ్‌శీల్ నగర్), ముజఫర్‌నగర్, బాఫ్‌ుపట్, ఘజియాబాద్, బులంద్‌శహర్, అలీగఢ్, ఆగ్రా, గౌతమ్‌బుద్ధ్ నగర్, మథుర జిల్లాల్లోని 58 అసెంబ్లీ స్థానాల్లో మొదటి విడత ఎన్నికలు జరుగనున్నాయి. పశ్చిమ ఉత్తరప్రదేశ్ జాట్`ముస్లిం ప్రాబల్య ప్రాంతం. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు ఉద్యమం జోరుగా సాగింది ఇక్కడే. ఈ నేపథ్యంలో మొదటి విడత ఎన్నికలకు ఎంతో ప్రాధాన్యం ఏర్పడిరది. కరోనా నేపథ్యంలో ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పోలింగ్ కేంద్రాల వద్ద భౌతిక దూరం పాటించడం, మాస్కు ధరించడం తప్పనిసరి చేసింది. ఎన్నికల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసింది.11 జిల్లాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద 50 వేలమంది పారామిలిటరీ సిబ్బందిని మోహరించింది. తొలిదశ పోలింగ్ జరిగే ప్రాంతాల్లో జాట్ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లే అధిక సంఖ్యలో ఉన్నారు. తొలి దశ ఎన్నికలు జరిగే ఈ జిల్లాల్లోనే రైతులు ఉద్యమాన్ని చేపట్టారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేశారు. దీంతో ఆయా జిల్లాల్లోని నియోజకవర్గాల ప్రజల తీర్పు తమకు అనుకూలంగా ఉంటుందని ఎస్పీ,బిఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు ఆశగా ఉన్నాయి. యోగి పాలనపైనే బిజెపి ఆశలు పెట్టుకుంది. సాగు చట్టాలు రద్దుచేసి రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పడం ద్వారా వారిని బుజ్జగించేందుకు ప్రధాని మోదీ ప్రయత్నించగా.. వారిని ఆకట్టుకు నేందుకు కేసుల ఎత్తివేత, బకాయిల చెల్లింపు వంటి చర్యలను సీఎం యోగి ఆదిత్యనాథ్ చేపట్టారు. ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ.. జాట్‌లలో బాగా పలుకుబడి ఉన్న రాష్టీయ్ర లోక్‌దళ్ (ఆర్‌ఎల్‌డీ)తో జట్టుకట్టి.. రైతులతో పాటు ముస్లింలకు చేరువయ్యేందుకు కృషిచేసింది. ఆర్‌ఎల్‌డీ అధినేత జయంత్ చౌధురి.. కేంద్ర మాజీ మంత్రి అజిత్‌సింగ్ కుమారుడు కావడంతో పాటు.. ఈ కుటుంబం రైతులతో మమేకమై ఉంది. లఖీంపూర్ ఖీరీలో రైతులపై పోలీసు కాల్పులతో ఆ వర్గంలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతుండడంతో.. ఈ పరిస్థితి తమకు సానుకూలమవుతుందని సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్ గట్టిగా విశ్వసిస్తున్నారు. పశ్చిమ యూపీలో అధిక స్థానాలు గెలిచిన పార్టీలే రాష్ట్రంలో అధికారం చేపడతాయన్న సెంటిమెంట్‌తో.. ఉన్నారు. దాదాపు అన్ని పార్టీలూ తమ తమ స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దించాయి. బీజేపీ తరఫున కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, యోగి ఆదిత్యనాథ్, ఎస్‌పీ, ఆర్‌ఎల్‌డీ అధినేతలతో పాటు బీఎస్‌పీ అధ్యక్షురాలు మాయావతి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తదితర అతిరథ, మహారథులు ప్రచారం చేపట్టారు. మొదటి విడత ఎన్నికల ప్రచారం మంగళవారం ముగిసింది. బుధవారం తాజాగా ప్రియాంక మేనిఫెస్టోను కూడా విడుదల చేసింది.