నేడు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక

– విపక్షాల అభ్యర్థిగా హరిప్రసాద్‌, ఎన్డీయే అభ్యర్థిగా హరివంశ్‌నారాయణ్‌
– నామినేషన్‌లు దాఖలు చేసిన ఇరువురు అభ్యర్థులు
– విపక్షాల అభ్యర్థికి మద్దతు ప్రకటించిన టీడీపీ
న్యూఢిల్లీ, ఆగస్టు 8(జ‌నం సాక్షి) : రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎంపికకు గురువారం ఎన్నిక జరగనుంది. ఉదయం 11 గంటలకు ఎన్నిక నిర్వహించనున్నారు. డిప్యూటీ ఛైర్మన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు ప్రతిపక్షాలు అంగీకరించకపోవడంతో ఈ పదవికి ఎన్నిక అనివార్యమైంది. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ పదవికి ఆగస్టు 9న ఎన్నిక నిర్వహించనున్నట్లు ఇటీవల రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు ప్రకటించారు. బుధవారం మధ్యాహ్నంతో నామినేషన్‌ దాఖలు చేయాలని సూచించారు. దీనిలో భాగంగా విపక్షాల అభ్యర్థిగా కాంగ్రెస్‌ సభ్యుడు బీకే హరిప్రసాద్‌ను, ఎన్డీయూ అభ్యర్థిగా జేడీయూ ఎంపీ హరివంశ్‌ నారాయణ్‌సింగ్‌ను బరిలోకి దింపనున్నారు. దీంతో బుధవారం వారిరువురు నామినేషన్‌లు దాఖలు చేశారు. ఇదిలా ఉంటే రాజ్యసభలో 244 మంది సభ్యులున్నారు. ఈ ఎన్నికలో మెజార్టీ సాధించాలంటే 123 ఓట్లు
అవసరం. అకాలీదళ్‌(మూడుసీట్లు), శివసేన (ముగ్గురు), బీజేడీ(తొమ్మిది మంది) ఓటింగ్‌కు దూరంగా ఉంటే ఎన్డీయే బలం 110కు పరిమితమవుతుంది. మెజార్టీ సైతం 115కు తగ్గుతుంది. మరోవైపు తెదేపా, వైకాపాతో కలుపుకొని తమకు 119 మంది సభ్యుల బలం ఉందని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. అరవింద్‌ కేజీవ్రాల్‌ నేతృత్వంలోని ఆప్‌, మెహబూబా ముఫ్తీకి చెందిన పీడీపీ సైతం ప్రతిపక్షాల అభ్యర్థికే మద్దతు ఇచ్చేటట్లు సంకేతాలు ఇచ్చారు. డీఎంకే కూడా ప్రతిపక్షాలవైపే మొగ్గు చూపుతోంది. దీంతో ఎన్నిక రసవత్తరంగా సాగనుంది.
అనూహ్యంగా తెరపైకి హరిప్రసాద్‌..
రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక అనూహ్య మలుపు తిరిగింది. ఏకగ్రీవానికి ప్రయత్నిస్తోన్న బీజేపీకి ఊహించని షాక్‌ తగిలింది. విపక్షాల తరఫున కాంగ్రెస్‌ సభ్యుడు బీకే హరిప్రసాద్‌ను బరిలోకి నిలపాలని ఆ పార్టీ నిర్ణయించింది. రాజ్యసభ ఉపాధ్యాక్ష పదవికి గురువారం ఎన్నిక నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ, సీపీఐ, టీఎంసీ, బీఎస్పీ తదితర పార్టీల మద్దతుతో విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిగా హరిప్రసాద్‌ పేరును తెరపైకి తీసుకొచ్చారు. సీపీఐ నేత రాజా స్వయంగా హరిప్రసాద్‌ పేరును ప్రకటించారు. కాంగ్రెస్‌ అభ్యర్థికి ఆప్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, తెలుగుదేశం తదితర పార్టీల మద్దతు ఖాయంగా కనిపిస్తోంది. అంతకు ముందు విపక్షాల అభ్యర్థిగా ఎన్సీపీ ఎంపీ వందనా చవాన్‌ను పేరు దాదాపు ఖరారు చేశారు. మంగళవారం రెండోసారి ప్రతిపక్ష పార్టీలు సమావేశమైనప్పుడు ఎన్సీపీ సభ్యురాలు వందనా చవాన్‌ పేరును బీజేపీ నేత సతీశ్‌ చంద్ర మిశ్రా, తృణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యుడు డేరక్‌ ఓబ్రెయిన్‌ ప్రతిపాదించారు. దీనికి కాంగ్రెస్‌తోపాటు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. ఎన్డీఏలోని కొన్ని పార్టీలు కూడా ఆమెకు మద్దతు ఇవ్వడానికి అంగీకరించాయి. అయితే అనూహ్యంగా కర్ణాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తోన్న హరి ప్రసాద్‌ పేరును ప్రతిపాదించడం విశేషం. ఆయన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగానూ కొనసాగుతున్నారు. దీనిపై హరిప్రసాద్‌ మాట్లాడుతూ.. ఈ నిర్ణయం తీసుకునే ముందు పార్టీ చాలా ఆలోచించిందని, మిగతా ప్రతిపక్ష పార్టీల నేతలతో చర్చిస్తామని అన్నారు. తమ అభ్యర్థికి మద్దతివ్వాలని ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ను కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ కోరారు. అయితే, ఆజాద్‌ కోరికను సున్నితంగా తిరస్కరించిన నవీన్‌ పట్నాయక్‌, తాము జేడీయూకు చెందిన హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌కు మద్దతిస్తామని హావిూ ఇచ్చామని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.
ఇదిలావుండగా, రాజ్యసభలో ఎన్డీఏకు పూర్తి మెజార్టీ లేకపోవడం బీజేపీ ఆందోళన చెందుతోంది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికల్లో హరిప్రసాద్‌ విజయం సాధిస్తారని కాంగ్రెస్‌ నేత ఆనంద్‌ శర్మ వ్యాఖ్యానించారు. తాము చాలా మంది పేర్లను పరిశీలించి చివరకు హరిప్రసాద్‌ పేరును ఖరారు చేశామని ఆయన తెలిపారు.