నేడు శ్రీకాకుళంలో చంద్రబాబు పతాకావిష్కరణ

భారీగా ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం

అందంగా ముస్తాబైన నగరం

అమరావతి,ఆగస్ట్‌14(జ‌నం సాక్షి): విభజన తరవాత ఎపి సిఎం చంద్రబాబు నాయుడు ఏటా స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 15న జిల్లా కేంద్రాల్లో పతాకావిష్కరణ చేస్తున్నారు. గత నాలుగేళ్లుగా ఇదే ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. తాజాగా ఈ యేడు సిఎం శ్రీకాకుళంలో జాతీయజెండాను ఆవిష్కరిస్తారు. అలాగే జిల్లాల్లో జెండా ఎగురవేసే మంత్రులు ఎవరన్నది ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా జిల్లాలకు ఇన్‌చార్జి మంత్రులుగా ఉన్నవాళ్లకే ఎక్కువుగా అవకాశం ఇచ్చారు. కొన్నిచోట్ల మాత్రం మార్పులు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకాకుళంలో పతాకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. అదే కార్యక్రమంలో జిల్లా మంత్రులు కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు పాల్గొంటారు. విశాఖలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, కర్నూలులో మరో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పతాకావిష్కరణ చేస్తారు. విజయనగరం జిల్లాలో గంటా శ్రీనివాసరావు, తూర్పు గోదావరిలో కాల్వ శ్రీనివాసులు, పశ్చిమ గోదావరిలో ప్రత్తిపాటి పుల్లారావు, గుంటూరు జిల్లాలో అయ్యన్న పాత్రుడు, ప్రకాశంలో నారాయణ,నెల్లూరులో అమర్‌నాథ్‌ రెడ్డి, కడపలో సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, అనంతపురంలో దేవినేని ఉమ, చిత్తూరులో నక్కా ఆనంద్‌ బాబు పతాకావిష్కరణ చేస్తారు. సిఎం చంద్రబాబు పాల్గొంటున్న శ్రీకాకుళం

జిల్లాలో రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర దినోత్సవానికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేసారు. వర్షాలు పడుతున్నందున మైదానంలో నీరు నిల్వ ఉండకుండా వెంటవెంటనే తరలించేందుకు చర్యలు చేపట్టారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక దృష్టి సారించారు. . ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతం కావడంతో మరింత అప్రమత్తం అయిన పోలీసులు నిఘా పెంచారు. పాసులు పొందినవారంతా కార్యక్రమానికి గంట ముందే రావాలని, లేకుంటే అనుమతించబోమని స్పష్టం చేశారు. 70 ఆర్టీసీ బస్సుల్లో విద్యార్థులను తీసుకునివచ్చేందుకు సిద్ధం చేస్తున్నట్టు కలెక్టర్‌ కె.ధనంజయరెడ్డి తెలిపారు. 21 నిమిషాల నిడివిలో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని, హై టీ కూడా వేదిక సవిూపంలోనే ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. వర్షపు నీరు నిల్వ ఉండకుండా ఆయిల్‌ ఇంజిన్లు తెప్పించి నీటిని బయటకు పంపిస్తున్నట్టు పేర్కొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, కవాతు, ఇతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్టు వివరించారు. 15వ తేదీ వరకు అల్పపీడనం ఉందని వాతావరణ శాఖ అధికారుల సమాచారం మేరకు చర్యలు తీసుకున్నామని కలెక్టర్‌ తెలిపారు.శ్రీకాకుళం నగరంలో పంద్రాగస్టు వేడుకల నేపథ్యంలో నగరం ముస్తాబయ్యింది. ప్రభుత్వ కార్యాలయాలు, నాయకుల విగ్రహాలు, ట్రాఫిక్‌ ఐల్యాండ్‌లు, నాగావళి వంతెన, ఆర్టీసీ సముదాయం, రహదారులను రంగురంగుల విద్యుద్దీపాలతో సుందరంగా అలంకరించారు. ఈ అలంకరణలతో నగరానికి నవ్య శోభ వచ్చింది.

తాజావార్తలు