నేడే అవిశ్వాసం

– పూర్తిమెజార్టీతో ధీమాగా ఉన్న బీజేపీ
– విభజన హావిూలపై నిలదీసేందుకు సిద్ధమైన తెదేపా
– బీజేపీ, కాంగ్రెసేతర పార్టీల మద్దతుకు లేఖలు రాసిన చంద్రబాబు
– పార్లమెంట్‌లో అనుసరించాల్సిన విధానంపై ఎంపీలకు దిశానిర్దేశం
– మద్దతు పలికిన ఆమ్‌ ఆద్మీ, డీఎంకే, మద్దతివ్వలేమన్న అన్నాడీఎంకే
– బీజేపీకి అనుకూలంగా శివసేన
– కేంద్ర విధానాలను చర్చలో ఎండగట్టేందుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్‌
న్యూఢిల్లీ, జులై19(జ‌నం సాక్షి) : 15ఏళ్ల తర్వాత శుక్రవారం లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ
జరుగనుంది. మోదీ సర్కార్‌పై టీడీపీతో సహా ఇతర విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంతో దేశ రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి.  మోదీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను క్యాష్‌ చేసుకునేందుకు రాజకీయ పార్టీలు వేగంగా పావులు కదుపుతున్నాయి. ఈ అవిశ్వాసం ఎపిసోడ్‌తో పొలిటికల్‌గా పైచేయి సాధించేందుకు కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. విశ్వాస తీర్మానంపై చర్చ తర్వాత జరిగే ఓటింగ్‌లో మోదీ సర్కార్‌ను కూల్చడం సాధ్యమయ్యే పనికాదు. ఎందుకంటే ఎన్డీయేకు స్పష్టమైన మెజార్టీ ఉంది.  అయినా త్వరలో ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో ఈ అవిశ్వాసం అంశాన్ని రాజకీయ అస్త్రంగా చేసుకునేందుకు కొన్ని విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ ఇందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. వాస్తవానికి మాయావతి నేతృత్వంలోని బీఎస్పీకి పెద్ద బలమేవిూ లేదు. అయినా యూపీలో మారిన పరిస్థితులు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇటీవల జరిగిన బైపోల్స్‌లో ఎస్పీ, డీఎస్పీ కూటమి బీజేపీ సిట్టింగ్‌ స్థానాలను కొల్లగొట్టింది. ఇప్పుడు అవిశ్వాసం సందర్భంగా బీజేపీ యూపీ ఎంపీలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది. ఈ లోక్‌సభ పదవీకాలం ఇంకా ఏడాది కూడా లేదు. ఇప్పుడు తమకు సహకరిస్తే వచ్చే ఎన్నికల్లో బీఎస్పీ తరపున టిక్కెట్లు ఇస్తామంటూ యూపీ బీజేపీ ఎంపీలకు మాయావతి గేలాం వేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బీజేపీలోని దళిత ఎంపీలను తనవైపు తిప్పుకునేందుకు మాయావతి ప్రయత్నిస్తున్నారు. అటు ఒడిస్సాలో అధికార బీజేడీ మాత్రం శుక్రవారం ఓటింగ్‌లో పాల్గొనకూడదని నిర్ణయించింది. లోక్‌సభలో బీజేడీకి 19 మంది సభ్యులు ఉన్నారు. ఒడిస్సాలో బీజేపీ ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ నవీన్‌ పట్నాయక్‌ మాత్రం సందర్భోచితంగా వ్యవహరిస్తున్నారు. మోదీతో సాన్నిహిత్యం కొనసాగిస్తున్నారనే ప్రచారం ఢిల్లీలో జరుగుతోంది. అందుకే శుక్రవారం అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఓటింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.
కేంద్రం తీరును ఎండగట్టేందుకు సిద్ధమైన కాంగ్రెస్‌..
శుక్రవారం పార్లమెంట్‌లో జరిగే అవిశ్వాస తీర్మానం చర్చలో బీజేపీ విధానాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడేందుకు కాంగ్రెస్‌ సిద్ధమవుతోంది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ బీజేపీ విధానాలను ఎత్తిచూపేందుకు సన్నద్ధమవుతోంది. సభలో దాదాపు ఏడుగంటల పాటు అవిశ్వాసంపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ సభ్యులకు గంట సమయం వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సమయంలో రాహుల్‌గాంధీనే నేరుగా ప్రసంగిస్తారని కాంగ్రెస్‌ నేతలు పేర్కొంటున్నారు. రాహుల్‌గాంధీతో పాటు, మల్లిఖార్జున్‌గార్గేలు అవిశ్వాసం చర్చలో పాల్గొని కేంద్రం తీరుపై పార్లమెంట్‌ సాక్షిగా దేశవ్యాప్తంగా తెలియజేస్తారని కాంగ్రెస్‌ నేతలు పేర్కొంటున్నారు. మరో వైపు అవిశ్వాసంలో ఎలాగైనా నెగ్గేలా కాంగ్రెస్‌ ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీకి ప్రస్తుతం సొంత బలం 273తోనే అవిశ్వాసాన్ని నెగ్గే పరిస్థితి ఉంది. దీనికితోడు ఎన్డీయే కూటమి పార్టీల ఎంపీలు సైతం ఉండటంతో బీజేపీ బలం ప్రస్తుతానికి 347 ఉంది.
విభజన హావిూలపై గలమెత్తేందుకు తెదేపా కసరత్తు..
శుక్రవారం పార్లమెంట్‌లో జరిగే అవిశ్వాసం చర్చలో విభజన హావిూలపై గలమెత్తేందుకు తెదేపా ఎంపీలు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అవిశ్వాసానికి మద్దతు కూడగట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 18అంశాలతో రాసిన లేఖను బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలకు ఆ పార్టీ ఎంపీలు అందజేశారు. ఉదయం ఢిల్లీ సీఎం క్రేజీవాల్‌ను కలిసిన ఎంపీలు చంద్రబాబు రాసిన లేఖను అందజేశారు.
ఈసందర్భంగా అవిశ్వాసంలో తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. దీంతో ఆప్‌ మద్దతు తెదేపాకు ఉంటుందని క్రేజీవాల్‌ స్పష్టం చేశారు. మరోవైపు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీని తెదేపా ఎంపీలు కలిసి మద్దతు కోరారు. తాను అవిశ్వాసానికి అనుకూలంగా ఓటే వేస్తానని తెదేపా ఎంపీలకు హావిూ ఇచ్చారు. ఇదిలా ఉంటే పార్లమెంట్‌లో జరిగే అవిశ్వాస తీర్మానంపై జరిగే చర్చలో విభజన సమస్యలపై లేవనెత్తే అంశాలను ప్రణాళిక ప్రకారం సభలో మాట్లాడాలని చంద్రబాబు ఎంపీలకుసూచించారు. ఈ మేరకు గెల్లాకు చంద్రబాబు అప్పగించినట్లు తెలుస్తోంది. కనీసం 15నిమిషాలకు పైగా సబలో మాట్లాడేలా అవకాశాన్ని కల్పించేలా స్పీకర్‌పై ఒత్తిడి తేవాలని చంద్రబాబు ఎంపీలకు సూచించారు.