.నేడే హుజురాబాద్‌ ఉప ఎన్నిక


` భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు
` ఉదయం 7గంటలకు పోలింగ్‌ ప్రారంభం
` గ్రామాలకు బయలుదేరిన పోలింగ్‌ సిబ్బంది
` ఓటర్ల తీర్పు ఎటువైపు ఉంటుందోనన్న ఆసక్తి
హుజూరాబాద్‌,అక్టోబరు 29(జనంసాక్షి): దేశం యావత్తూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న హుజురాబాద్‌ ఉపఎన్నిక పోలింగ్‌ శనివారం జరగనుంది. పోలింగ్‌ నిర్వహణ కోసం ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేసారు. శుక్రవారం సిబ్బందికి విధుల కేటాయింపు జరిగింది. ఈవీఎంలతో పోలింగ్‌ కేంద్రాలకు సిబ్బంది బయలుదేరారు. ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 306 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసారు. మొత్తం ఓటర్లు 2,37,036 అందులో పురుషులు 1,17,933 మంది, స్త్రీలు 1,19,102 ఉండగా.. 14 మంది ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు ఉన్నారు. 306 పోలింగ్‌ కేంద్రాల్లో…306 కంట్రోల్‌ యూనిట్స్‌తో పాటు 612 బ్యాలెట్‌ యూనిట్స్‌, 306 వివి ఫ్యాట్స్‌ను ఏర్పాటు చేశారు. ఓటర్ల తీర్పు ఎటువైపు ఉంటుందోనన్న ఆసక్తి కనిపిస్తోంది. శనివారం ఉద యం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభం కానుండటంతో.. ప్రధాన పార్టీలు ఓటర్లకు గాలం వేసేందుకు చివరి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. డబ్బుఉల విచ్చలవిడిగా పంపంకం చేశారు. కీలక నేతలు నియోజకవర్గాన్ని వదిలి వెళ్లినా కూడా ఫోన్ల ద్వారా స్థానిక నేతలతో పూర్తిస్థాయిలో పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేయిస్తున్నారు. ఈ క్రమంలో డబ్బు, మద్యం, ఇతర బహుమతుల పంపిణీ భారీ ఎత్తున కొనసాగుతోందని స్థానికులు చెప్తున్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల నేపథ్యంలో కేంద్ర సాయుధ బలగాలు మోహరిం చాయి. వారం రోజుల క్రితం రెండు సీఏపీఎఫ్‌ కంపెనీలు కేంద్రం నుంచి దిగాయి. హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఈ కంపెనీలతో కవాత్‌లు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఎన్నికలను టీఆర్‌ఎస్‌, బీజేపీ పోటాపోటీగా తీసుకోవడంతో హుజూరాబాద్‌లో రాజకీయం వేడెక్కింది. రెండు రోజుల క్రితం ఎన్నికల ప్రచారం ముగిసింది. స్థానికేతరులందరూ ఇక్కడి నుంచి వెళ్లారు. గురువారం 18 కేంద్ర కంపెనీల బలగాలు దిగాయి. శుక్రవారం నుంచి అన్ని గ్రామాల్లోని పోలింగ్‌ కేంద్రాలకు తరలి వెళ్లారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల ప్రచారానికి బుధవారం సాయంత్రం తెరపడిరది. 30న ఉదయం ఏడు గంటలకు పోలింగ్‌ ప్రారంభం కానుంది. నవంబర్‌ 2న ఓట్ల లెక్కింపు జరుగనుంది. అధికార టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలతోపాటు కొందరు స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్న ఈ ప్రతిష్టాత్మక ఎన్నిక కోసం.. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా దాదాపు నాలుగు నెలలపాటు ప్రచార పర్వం సాగింది.