నేను గెలవకపోతే శుద్ధ దండుగే : డొనాల్డ్ ట్రంప్

2016 అధ్యక్ష ఎన్నికల్లో తాను విజయం సాధించకపోతే పన్నులను తగ్గించలేనని, సైన్యాన్ని పటిష్టం చేయలేనని, అమెరికాను మళ్ళీ మహోన్నతంగా తీర్చిదిద్దలేనని చెప్పారు. తాను గెలవకపోతే తన ప్రచారమంతా శుద్ధ దండుగ అని, డబ్బు, శ్రమ వృథా అయ్యాయని భావిస్తానన్నారు. తన రాజకీయ ప్రత్యర్థులు తనకు వ్యతిరేకంగా చేసిన ప్రచారంపై మాత్రమే తాను ప్రతిస్పందించానని చెప్పారు. అయితే తనది చాలా బలమైన ప్రతిస్పందన అని పేర్కొన్నారు.
ఫాక్స్ న్యూస్ హోస్ట్ మెజిన్ కెల్లీ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ ఆగస్టులో కెల్లీ ఫైల్ కార్యక్రమంపై తాను మండిపడటానికి కారణాన్ని వివరించారు. అదే సమయంలో ఆ కార్యక్రమంలో కెల్లీ తనను అడిగిన ప్రశ్నలు తన ప్రత్యర్థులతో తలపడటంలో తనకు ఎంతో ఉపయోగపడ్డాయన్నారు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగితే ఏదైనా సాధించవచ్చునన్నారు. అప్పట్లో ఆయన మెజిన్ కెల్లీపై భారీగా విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కెల్లీ వల్ల తనకు ఎంతో మేలు జరిగిందని మాట మార్చారు. అప్పట్లో కెల్లీపై మండిపడటం గురించి మాట్లాడుతూ మహిళల విషయంలో గతంలో తాను చేసిన వ్యాఖ్యలను కెల్లీ ప్రస్తావించడం అనుచితమని తాను భావించినట్లు చెప్పారు. ఆ తర్వాత ‘‘నాయనా! ఏం ప్రశ్నరా ఇది’’ అని తనలో తాను అనుకున్నట్లు తెలిపారు. ‘‘నేను మిమ్మల్ని నిందించాలనుకోవడం లేదు. ఎందుకంటే మీరు మీ పని చేశారు. కానీ నాకు అది ఇష్టపడలేదు’’ అన్నారు.
తన వ్యక్తిగత జీవితం గురించి ట్రంప్ మాట్లాడుతూ తన సోదరుడు ఫ్రెడ్ మద్యానికి బానిసై ప్రాణాలు కోల్పోయారని, ఆ బాధను ఇప్పటికీ మర్చిపోలేనని చెప్పారు. తాను ఇప్పటి వరకు ఒక్క గ్లాస్ మద్యమైనా ముట్టుకోలేదని అన్నారు. తాను కోరుకునే పదవికి ఉండే బాధ్యతలను తాను చాలా శ్రద్ధగా నిర్వహిస్తానన్నారు.