‘నేను రాకుంటే అమెరికా మారదు’

'నేను రాకుంటే అమెరికా మారదు'
 వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ తన ఎన్నికల ప్రచార వేడి పెంచారు. ఓర్లాండోలో జరిగిన కాల్పుల ఘటన అనంతరం ఆయన ఏకంగా ప్రభుత్వ పనితీరును ఎండగట్టే పనిలో పడ్డారు. ఈ క్రమంలో పరోక్షంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను తప్పుబడుతున్నారు. ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలో అమెరికా పూర్తిగా విఫలమైందని, ఈ వ్యవస్థ ద్వారానే అమెరికా ఉగ్రవాదాన్ని దిగుమతి చేసుకుందని అన్నారు.’మన దగ్గరికి ఇస్లాం తీవ్రవాదం ఎలా వస్తుందనే విషయంపై మనం నిజం మాట్లాడుకోవాలి. వలసచట్టం విఫలం అవడం ద్వారా మన దేశంలోకి ఇస్లాం తీవ్రవాదాన్ని దిగుమతి చేసుకుంటున్నాం. మన ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. తనఖీల్లో అధికారులు ఫెయిలయ్యారు. ఇంటెలిజెన్స్ కూడా సరిగా పనిచేయడం లేదు. అయినప్పటికీ మన అధ్యక్షుడు బరాక్ ఒబమా మాత్రం ఇంటెలిజెన్స్ అధికారులను వెనుకేసుకొస్తున్నారు. నేను అధికారంలోకి వస్తే ఇదంతా మారుతుంది’ అని ట్రంప్ చెప్పారు.అమెరికాలోని ఓర్లాండోలో ఉగ్రవాద భావజాలం ప్రేరేపితుడైన మతీన్ అనే వ్యక్తి జరిపిన కాల్పుల కారణంగా దాదాపు 50మంది ప్రాణాలుకోల్పోయి అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఘటనగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో న్యూ హ్యాంప్ షైర్ వద్ద మాట్లాడిన ట్రంప్ వెంటనే అమెరికాలోకి ముస్లింలు ప్రవేశించకుండా ఓ తాత్కలిక నిషేధం విధించాలని డిమాండ్ చేశారు.ప్రస్తుతం ఉన్న వలస చట్టం అసలు మన దేశంలోకి ఎవరు అడుగుపెడుతున్నారో చెప్పలేదు. మన ప్రజల్ని రక్షించలేదు. మనకు గట్టి పోటీ ఇవ్వలేని పాలనా యంత్రాంగం ఉంది. ఇది మారాలి. నేను అధ్యక్షుడిగా కాలేకపోతే మరో నాలుగేళ్లపాటు కూడా ఈ అమెరికా వ్యవస్థ ఏమాత్రం మారదు. కానీ మార్పు  రావాలి.. అది ఇప్పుడే రావాలి. 50మంది చనిపోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. కానీ, ఈ అంశంపై మనం చర్చించుకునేందుకు ఇప్పటికీ సిద్ధంగా లేము.. కానీ ఇది తప్పక చర్చించాల్సిన ముఖ్యమైన అంశం. శాన్ బెర్నార్డియో ఘటన తర్వాత ముస్లింలను నిషేధించాలని నేను చెబితే అంతా నన్ను తిట్టారు. నవ్వారు.. ఇప్పుడు నేను కరెక్టే అంటున్నారు. ఇప్పటికీ చెబుతున్నాను. ప్రస్తుతం ముస్లింల రాకపై తాత్కాలికంగా నిషేధం విధించి శాశ్వత పరిష్కారం కనుక్కోవాల్సిందే’ అని ట్రంప్ అన్నాడు.