నేనే హోంమంత్రినైతే.. 

మేధావులను చంపాలని ఆదేశిస్తా
– కర్ణాటక భాజపా నేత వివాదాస్పద వ్యాఖ్యలు
– మండిపడుతున్న ప్రతిపక్షాలు
బెంగళూరు, జులై27(జ‌నం సాక్షి) : ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌షాలు పదేపదే హెచ్చరిస్తున్నప్పటికీ.. ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆపడం లేదు. తాజాగా కర్ణాటకకు చెందిన ఓ సీనియర్‌ భాజపా ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను కేంద్ర ¬ం శాఖ మంత్రినైతే దేశంలోని మేధావులను కాల్చి చంపాలని ఆదేశాలు జారీ చేస్తానని వ్యాఖ్యానించారు. భాజపా నేత వ్యాఖ్యలపై ఇతర పార్టీల నేతలు మండిపడుతున్నారు. విజయపుర ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్‌ ‘కార్గిల్‌ విజయ్‌ దివస్‌’ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఉదారవాదులు, మేధావులను ఆయన దేశద్రోహులుగా పేర్కొన్నారు. ‘మేధావులు ఈ దేశంలో ఉంటూ.. ప్రజా ధనంతో అన్ని రకాల సౌకర్యాలను అనుభవిస్తుంటారు. అయితే వారు భారత సైన్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు. మన దేశానికి మేధావులు, లౌకికవాదుల నుంచి మిగతావారి కంటే ఎక్కువ ముప్పు పొంచి ఉందని, నేనే గనుక కేంద్ర ¬ంశాఖ మంత్రినైతే ఇలాంటివారిని కాల్చి చంపాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేస్తా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా ఇదే విధంగా వ్యాఖ్యలు చేసి బసనగౌడ వివాదాల్లో చిక్కుకున్నారు. ముస్లింలకు సహాయపడొద్దని స్థానిక నేతలకు బహిరంగంగా సూచించారు. పాటిల్‌ గతంలో వాజ్‌పేయ్‌ ప్రభుత్వంలో కేంద్ర సహాయ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.