నేనైతే ఇలాంటి తీర్పు ఇచ్చేవాడిని కాదు

– శబరిమలె, వివాహేతర సంబంధాల కేసులో తీర్పు సరికాదేమో
– దేశలో పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాలి
– సుప్రింకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కెండయ కట్టా
న్యూఢిల్లీ, అక్టోబర్‌22(జ‌నంసాక్షి) : ఇటీవల కాలంలో సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన పలు తీర్పులపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ప్రెస్‌ కౌన్సిల్‌ మాజీ ఛైర్మన్‌ జస్టిస్‌ మార్కెండయ కట్జూ సైతం ఈ తీర్పులపై ముఖ్యంగా శబరిమల, వివాహేతర సంబంధాల కేసులో ధర్మాసనం నిర్ణయాలను ఆయన ఎత్తిచూపారు. తన ఫేస్‌బుక్‌ పేజ్‌లో ఓ లేఖను షేర్‌ చేసిన జస్టిస్‌ కట్జూ.. అందులో జస్టిస్‌ నారీమన్‌, జస్టిస్‌ ఖన్విల్కర్‌, జస్టిస్‌ చంద్రచూడ్‌, జస్టిస్‌ కౌల్‌లు ఇటీవల వెల్లడించిన తీర్పులను ప్రస్తావించారు. తాను గత కొద్ది నెలలుగా విదేశాల్లో ఉన్నానని, కానీ ఇటీవల కాలంలో వెల్లడించిన తీర్పులను అంతర్జాలంలో పరిశీలించానని, విూ మెయిల్‌ ఐడీలు లేనందున ఈ లేఖను సోషల్‌ విూడియాలో పోస్ట్‌ చేస్తున్నానని అన్నారు. అంతేకాదు విూకు అడ్డుపడాలనే ఉద్దేశం కాదని, ఓ పెద్దన్నలా సూచనలు చేయాలనేదే నా అభిమతమని తెలిపారు. తన సూచనలు విూరు మరింత గొప్ప న్యాయమూర్తులు కావడానికి ఉపయోగపడాలనేది నా కోరికని ఆయన వ్యాఖ్యానించారు. ఐటీ చట్టంలోని
సెక్షన్‌ 66-ఎ ను జస్టిస్‌ నారీమన్‌ కొట్టివేసిన తీరు అభినందనీయమని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అసమ్మతి, భిన్నాభిప్రాయాలు సేఫ్టీ వాల్వ్‌ లేకపోతే అది ప్రెజర్‌ కుక్కర్‌లా పేలిపోతుందని జస్టిస్‌ చంద్రచూడ్‌ వ్యాఖ్యలు హర్షణీయమని పేర్కొన్నారు. కానీ, స్వేచ్ఛ, గౌరవం, లైంగిక సమానత్వం అనే విశాలమైన అంశాల దగ్గరకు వచ్చేసరికి దేశ వాస్తవిక పరిస్థితులను కూడా గమనించాలని జస్టిస్‌ కట్జూ సూచించారు. ఈ సందర్భంగా శబరిమల తీర్పును ఉదాహరణగా చూపుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
లైంగిక సమానత్వం అనే సిద్ధాంతం సరైందే కానీ, భారత్‌లో మత ప్రమేయం, అది ఎంతగా పాతుకుపోయిందో పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. ఇలాంటి తీర్పులు ఐరోపా, అమెరికా దేశాలకు వర్తిస్తాయి కానీ, మన దేశంలో ఇది ఆమోదయోగ్యం కాదన్నారు. అయ్యప్ప ఆలయంలోకి రుతుక్రమం వయసున్న మహిళలను రానివ్వకపోవడమంటే వారిని కించపరచడం కాదని, అది నైష్ఠిక బ్రహ్మచారి అయిన భగవంతుడిపై భక్తులకుండే విశ్వాసమని అన్నారు. నేను కూడా నాస్తికుడినే.. కానీ, ఇతరుల మత విశ్వాసాలు, స్వేచ్ఛను గౌరవిస్తాను.. తానైతే ఇలాంటి తీర్పును ఇచ్చేవాడిని కాదని అన్నారు. ఇలాంటి తీర్పుల వల్ల అనేక ఇబ్బందులు ఉత్పన్నమవుతాయని, దీని ప్రభావంతో శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలుగుతుందని తెలిపారు. ఈ అంశంలో విూతో విభేదించిన మహిళా న్యాయమూర్తి జస్టిస్‌ ఇందు మల్హోత్రా వైఖరే తనకు సరైందిగా అనిపిస్తోందని వివరించారు. ఎందుకంటే గొప్ప వైవిధ్యత కలిగిన మనదేశంలో సాధారణ మతవిశ్వాసాలు, ఆచారాల్లో న్యాయమూర్తులు జోక్యం చేసుకోవడం సబబుకాదనే ఆమె వాదనలో నిజముందని అన్నారు. అలాగే వివాహేతర సంబంధాలపై తీర్పు కూడా సరికాదని చురకలంటించారు. వివాహిత మహిళలు ఎవరితోనైనా లైంగిక సంబంధం పెట్టుకోవచ్చనే భావనకు దారితీస్తుందని, భారత్‌ లాంటి సంప్రదాయక సమాజంలో ఇది తక్షణం ఆమోదయోగ్యం కాదని వివరించారు.