నేపియర్‌ వన్డేలో సూర్యకిరణాల కారణంగా మ్యాచ్‌ నిలిపివేత

న్యూఢిల్లీ,జనవరి23(జ‌నంసాక్షి): అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటి వరకు వేల సంఖ్యలో మ్యాచ్‌లు జరిగినా ఎండకారణంగా నిలిచిన ఘటనలు అరుదుగా ఉన్నాయి. వందల మ్యాచ్‌లు వరుణుడి కారణంగా నిలిచిపోయాయి. అయితే బుధవారం నేపియర్‌ వేదికగా భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య జరిగిన వన్డే సూర్యుడి అడ్డంకితో తాత్కాలికంగా నిలిపివేయడం మాత్రం విచిత్రంగా అనిపించింది. న్యూజిలాండ్‌లో ఇలాంటి పరిస్థితులు సహజం. సాధారణంగా అన్ని దేశాల మైదానాల్లో పిచ్‌లు ఉత్తర, దక్షిణ అభిముఖంగా ఉంటాయి. నేపియర్‌లో మాత్రం తూర్పు, పడమర ముఖంగా ఉంటాయి. దీంతో సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో బ్యాట్స్‌మెన్‌ బంతులు ఎదుర్కోవడం కష్టం. సూర్య కిరణాలు నేరుగా కళ్లలో ప్రసరించడంతో ఇబ్బంది అవుతుందని మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. ‘నా 15 ఏళ్ల అంపైరింగ్‌ కెరీర్‌లో ఇలాంటిది మునుపెన్నడూ చూడలేదు’ అని షాన్‌ జార్జ్‌ అన్నారు.