న్యాయం చేయండి.-సొమ్ము ఇప్పించండి– సహారా ఇండియా మోసం పై డీసీఐసీని ఆశ్రయించిన బాధితులు

తొర్రూరు25 జూన్( జనంసాక్షి )
కష్టించి సంపాదించిన డబ్బును పోగు చేసుకునేందుకు సహారా ఇండియా తొర్రూర్ బ్రాంచ్ లో కట్టారు. రూపాయి కలిసి వస్తుందనే ఆశతో సహారా ఇండియా బ్రాంచ్ లో డిపాజిట్ చేశారు. డిపాజిట్ చేసిన డబ్బు మిత్తి కలిసి ఇమ్మంటే కాలయాపన చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు.దీంతో విసిగిపోయిన బాధితులు జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రంను ఆశ్రయించాడు. గత సంవత్సరం నుంచి రావాల్సిన డబ్బులు సకాలంలో చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న సహారా ఇండియా బ్రాంచ్ పై చర్యలు తీసుకోవాలని,తాము చెల్లించిన మొత్తం వడ్డీ ఇప్పించాలని కోరుతూ తొర్రూరు పట్టణ కేంద్రానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి ఎండి.మౌలానా పాషా  శనివారం డివిజన్ కేంద్రంలో డీసీఐసీ జిల్లా ఇన్ ఛార్జ్  వింజమూరి సుధాకర్ ను కలిశారు. ఆయనకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.తొర్రూరు పట్టణంలో ఉన్న సహారా ఇండియా తొర్రూరు బ్రాంచ్ లో 2016 జనవరి 29న రూ.11 లక్షల 57 వేలు డిపాజిట్ చేయడం జరిగిందని, అట్టి రూపాయలు మిత్తి తో కలిసి 2021మే 29న దాదాపు 23 లక్షలు ఇవ్వాల్సి ఉందన్నారు. సంవత్సరం దాటినప్పటికీ డబ్బులు ఇవ్వకుండా   నిర్వాహకులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధితుడు వాపోయాడు. ఎన్నిసార్లు తిరిగినా రేపు మాపు అంటూ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. దీంతో విసిగిపోయి వినియోగదారుల సమాచార కేంద్రం జిల్లా ఇన్చార్జ్ సుధాకర్ ను ఆశ్రయించినట్లు తెలిపారు.ఎన్నిసార్లు కలిసినా దాటవేత ధోరణి తో వ్యవహరిస్తున్నారని, తమకు రావాల్సిన 23 లక్షల రూపాయలను  ఇప్పించి న్యాయం చేయాలని బాధితుడు మౌలానా పాషా ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ రూపాయి రూపాయి కూడబెట్టుకున్న సొమ్మును డిపాజిటర్లకు ఇవ్వకుండా కొన్ని చిట్‌ఫండ్‌ కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని, వినియోగదారుల సమాచార కేంద్రాన్ని ఆశ్రయిస్తే వారికి న్యాయం జరుగుతుందని తెలిపారు.అధిక వడ్డీ ఇస్తామని చెబుతూ కొన్ని సంస్థలు పెద్ద ఎత్తున డిపాజిట్లు సేకరిస్తున్నాయని, ఆ సొమ్మును ఇతర వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టి లాభాలు జేబులో వేసుకుంటున్నాయని అన్నారు.  ఇలాంటి సంస్థల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.1986లో వినియోగదారుల రక్షణకు ఒక విప్లవాత్మకమైన చట్టాన్ని తెచ్చిందని,ఈ చట్టం వినియోగదారులు హక్కుల పరిరక్షణ కు దోహదపడుతుందని తెలిపారు.