న్యాయం చేయాలని వినతి

 కమల్ జ్యోతి చిట్ ఫండ్ మోసంపై డీసీఐసీని ఆశ్రయించిన బాధితులు
తొర్రూరు 30 జూన్ (జనంసాక్షి )
కష్టించి సంపాదించిన డబ్బును పోగు చేసుకునేందుకు తొర్రూరు  పట్టణంలోని కమల్ జ్యోతి చిట్ ఫండ్ లో చిట్టి కట్టారు. సుమారు 48  నెలలు కట్టిన చిట్టి డబ్బులు రూ.4.50 లక్షలు రావాల్సి ఉండగా ఇవ్వకుండా  కాలయాపన చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు.దీంతో విసిగిపోయిన బాధితులు జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రంను ఆశ్రయించాడు. మే నెలలో ఇవ్వాల్సిన డబ్బులు సకాలంలో చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న కమల్ జ్యోతి చిట్ ఫండ్ యజమాన్యం పై చర్యలు తీసుకోవాలని,తాము చెల్లించిన మొత్తం వడ్డీ ఇప్పించాలని కోరుతూ తొర్రూరు మండలంలోని బోజ్య తండా గ్రామ శివారు సీత్య తండాకు చెందిన జాటోత్ సోమ్లా డివిజన్ కేంద్రంలో డీసీఐసీ జిల్లా ఇన్ ఛార్జ్  వింజమూరి సుధాకర్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఆయనకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.తొర్రూరు పట్టణంలో ఉన్న కమల్ జ్యోతి చిట్ ఫండ్ లో ప్రతి నెల రూ. 10 వేల చొప్పున 48 నెలలు డిపాజిట్ చేయడం జరిగిందని, ఆ చిట్టి ఏప్రిల్ నెలలో అయిపోయిందని,తనకు మే నెలలో ఇవ్వాల్సి ఉందన్నారు. రావాల్సిన చిట్టి డబ్బులు ఇవ్వకుండా నిర్వాహకులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధితుడు వాపోయాడు. ఎన్నిసార్లు తిరిగినా రేపు మాపు అంటూ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. దీంతో విసిగిపోయి వినియోగదారుల సమాచార కేంద్రం జిల్లా ఇన్చార్జ్ సుధాకర్ ను ఆశ్రయించినట్లు తెలిపారు.ఎన్నిసార్లు కలిసినా దాటవేత ధోరణి తో వ్యవహరిస్తున్నారని, తమకు రావాల్సిన రూ. 4.50 లక్షలు ఇప్పించాలని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న భాస్కర్ కు వరంగల్ కపిల్ చిట్ ఫండ్ బ్రాంచ్ నుంచి వినియోగదారుల సమాచార కేంద్రం నుండి రూ.5 లక్షల 20వేల రూపాయలు ఇప్పించడం జరిగిందన్నారు.కూడబెట్టుకున్న సొమ్మును డిపాజిటర్లకు ఇవ్వకుండా కొన్ని చిట్‌ఫండ్‌ కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని, వినియోగదారుల సమాచార కేంద్రాన్ని ఆశ్రయిస్తే వారికి న్యాయం జరుగుతుందని తెలిపారు.అధిక వడ్డీ ఇస్తామని చెబుతూ కొన్ని సంస్థలు పెద్ద ఎత్తున డిపాజిట్లు సేకరిస్తున్నాయని,ఇలాంటి సంస్థల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రైతులు విత్తనాల కొనుగోలులో మోసపోకుండా రసీదులు తీసుకోవాలని ఆన్ లైన్ మోసాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. వినియోగదారులకు మోసం జరిగితే వినియోగదారుల సమాచార కేంద్రాన్ని సందర్శించాలని కోరారు.
Attachments area