న్యాయమూర్తులకు మరో రెండేళ్లు!

– పదవీవిరమణ వయసు పెంపు యోచనలో ప్రభుత్వం
– పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం కసరత్తు
న్యూఢిల్లీ, జులై18(జ‌నం సాక్షి) : సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసును మరో రెండేళ్లు పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల కొరత ఎక్కువ ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. బుధవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోంది.
ప్రస్తుతం సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు 65, హైకోర్టుల్లో 62గా ఉంది. అయితే సుప్రీంకోర్టులో జడ్జీల పదవీ విరమణ వయసును 67కు, హైకోర్టుల్లో 64కు పెంచాలని కేంద్రం భావిస్తోంది. ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల కొరత ఎక్కువగా ఉండటంతో చాలా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో జడ్జీల రిటైర్‌మెంట్‌ వయసును పొడగించాలని పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఇటీవల కేంద్రాన్ని కోరినట్లు తెలుస్తోంది. దీని వల్ల న్యాయమూర్తుల కొరత తగ్గడంతో పాటు.. పెండింగ్‌లో ఉన్న కొన్ని కేసుల విచారణ కూడా పూర్తవుతుందని కమిటీ అభిప్రాయపడింది. కాగా.. హైకోర్టుల్లో న్యాయమూర్తుల పదవీ విమరణ వయసును 62 నుంచి 65కు పెంచాలని 2010లో అప్పటి యూపీఏ ప్రభుత్వం బిల్లు తీసుకొచ్చింది. అయితే అప్పటి లోక్‌సభ సమావేశాల్లో ఈ బిల్లు కనీసం చర్చకు కూడా రాకపోవడం గమనార్హం. ప్రస్తుతం హైకోర్టుల్లో న్యాయమూర్తుల కొరత తీవ్రంగా ఉంది. న్యాయశాఖ డేటా ప్రకారం.. మొత్తం 24 హైకోర్టుల్లో 406 జడ్జీల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలహాబాద్‌ హైకోర్టులో 56, కర్ణాటక హైకోర్టులో 38, కోల్‌కతా హైకోర్టులో 39, పంజాబ్‌ అండ్‌ హరియాణా హైకోర్టులో 35, తెలంగాణ అండ్‌ ఆంధప్రదేశ్‌ హైకోర్టులో 30, బాంబే హైకోర్టులో 24 జడ్జీల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో కలిపి దాదాపు 3 కోట్ల కేసులు పెండింగుల్లో ఉన్నాయి.