న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో కాల్పులు ఉత్తిదే!
న్యూయార్క్: న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్ కెన్నెడీఅంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం కాల్పులు జరిగినట్లు వార్తలు రావడంతో కలకలం రేగింది. దీంతో రంగంలోకి దిగిన భద్రతా దళాలు విమానాశ్రయం మొత్తం అణువణువు గాలించి అదంతా ఉత్తిదే అని తేల్చేశాయి. తాము కాల్పుల శబ్దాలు విన్నట్లు ఇద్దరు వ్యక్తులు అధికారుల దృష్టికి తీసుకురావడంతో పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. ప్రతి ఫ్లోర్‌ను క్షుణ్ణంగా గాలించాయి. అక్కడ కాల్పులు జరిగినట్లు ఎటువంటి ఆధారాలు లభించలేదని పేర్కొన్నాయి. అక్కడ ఏర్పాటు చేసిన కెమేరాల్లో కూడా కాల్పులకు సంబంధించిన దృశ్యాలు నమోదుకాలేదని పోలీసులు ప్రకటించారు.
ఎయిర్‌పోర్టు అథారిటీ పోలీసులు విమానాశ్రయాన్ని కట్టుదిట్టం చేసి ప్రయాణికులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. ఎవరినీ అరెస్టు చేయలేదని పేర్కొన్నారు. దీనిపై మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు రావడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. దీనికి సోషల్‌మీడియా పోస్టులు ఆజ్యం పోశాయి. తర్వాత ఎయిర్‌పోర్టు అథారిటీ ట్విట్టర్ ద్వారా ప్రకటించడంతో జనం వూపిరి పీల్చుకున్నారు.
బలగాల మోహరింపు..
కాల్పులపై ఫిర్యాదు రావడంతో ఎయిర్ పోర్టు అథారిటీ పోలీసులకు అదనంగా న్యూయార్క్ పోలీసు బలగాల్లోని హెర్క్యులెస్ స్ట్రైక్ టీం, క్రిటికల్ రెస్పాన్స్ కమాండ్, స్ట్రాటెజిక్ రెస్పాన్స్ గ్రూప్, ఎమర్జెన్సీ సర్వీసు గ్రూప్, గస్తీ పోలీసులను అక్కడకు తరలించారు.
చెల్లాచెదురుగా సామగ్రి
కాల్పుల సమాచారం రాగానే తొలుత పోలీసులు ప్రయాణికులను బయటకు తరలించారు. దీంతో వందల సంఖ్యలో ప్రయాణికులు ప్రాణభయంతో తమ సామగ్రిని అక్కడే వదిలేసి బయటకు పరుగులు తీశారు. దీంతో ఎయిర్‌పోర్టు మొత్తం ప్రయాణికుల సామగ్రి చిందరవందరగా పడి ఉన్నాయి.