పంచనదుల మహా సంగమమే లక్ష్యం


– బోట్‌ రేసింగ్‌, ఎయిర్‌షోతో అమరావతి ఖ్యాతి పెంచాం
– అందరి దృష్టి అమరావతిపైనే ఉంది
– టెక్నాలజీ వినియోగంలోనూ, ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌లోనూ ముందున్నాం
– నాణ్యమైన పైర్లు, ఆరోగ్య జీవనానికి ఏపీ చిరునామా కావాలి
– ఎప్పటికప్పుడు రైతులను చైతన్యపర్చాలి
– పశుగణాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ద పెట్టండి
– టెలీకాన్ఫరెన్స్‌లో ఏపీ సీఎం చంద్రబాబు
అమరావతి, నవంబర్‌26(జ‌నంసాక్షి) : గోదావరి-పెన్నా నదుల అనుసంధానం ఇంకో చరిత్ర కానుందని, మరో చరిత్రకు శ్రీకారం చుడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం నీరు-ప్రగతిపై సీఎం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇప్పటికే గోదావరిని కృష్ణానదితో అనుసంధానం చేశామని, పంచ నదుల మహా సంగమమే లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రపంచం వినూత్న ఆవిష్కరణల వైపు చూస్తోందన్నారు. బయో మెట్రిక్‌ ద్వారా పారదర్శకంగా పథకాల అమలు చేయాలని అధికారులకు సూచించారు.  అనంతపురంలో సూక్ష్మ సేద్యం ద్వారా అద్భుత ఫలితాలు వచ్చాయని చంద్రబాబు అన్నారు. మైక్రో ఇరిగేషన్‌తో ఉత్పాదకత 29శాతం పెరిగిందని సీఎం పేర్కొన్నారు.
బోట్‌ రేసింగ్‌, ఎయిర్‌ షోతో అమరావతి ఖ్యాతి పెంచామన్నారు. అంతర్జాతీయంగా అందరి దృష్టి అమరావతిపైనే ఉందని పేర్కొన్నారు. నెల చివరిలో, డిసెంబర్‌ మొదట్లో వర్షాలు పడే అవకాశం ఉందని అన్నారు. రబీలో సీమ జిల్లాలు, ప్రకాశంలో పంటల విస్తీర్ణం పెరిగిందని, నాణ్యమైన పైర్లు, ఆరోగ్య జీవనానికి ఏపీ చిరునామా కావాలని తెలిపారు. కత్తెర తెగులు సోకకుండా జొన్న, మొక్కజొన్నను కాపాడాలన్నారు. ఎప్పటికప్పుడు రైతులను చైతన్యపరచాలని సీఎం ఆదేశించారు. గోకులం, మినీ గోకులాలను సద్వినియోగం చేసుకోవాలని, పశు గణాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ముందున్నామని, టెక్నాలజీలో ఏపీనే ముందుందని చెప్పారు. ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌ లో కూడా తామే ముందుండాలని ఆకాంక్షించారు. నరేగాలో గత ఏడాది లక్ష్యం పూర్తిచేశామని, రూ.10వేల కోట్ల నరేగా లక్ష్యాన్ని చేరుకోవాలని తెలిపారు. ఆదరణ-2 పనిముట్లు వెంటనే పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.