పంచాయితీ ఎన్నికల వాయిదా సరికాదు
రిజర్వేషన్ల బూచితో గ్రామ స్వరాజ్యం కాలరాయడం తగదు
హైదరాబాద్/అమరావతి,ఆగస్ట్8(జనం సాక్షి): ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన పంచాయితీ ఎన్నికలకు సంబందించి గడవు ముగియడంతో ఇరు తెలుగు రాష్ట్రాల్లో రెండో తేదీనుంచి ప్రత్యేక అధికారుల పాలన మొదలయ్యింది. పంచాయితీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రిజర్వేషన్కలు తేలకపోవడం కారణంగా స్థానిక ఎన్నికలు నిలిపివేశారు. నిజానికి జాతీయస్థాయిలో ఎంపి ఎన్నికలు, రాష్ట్రాల స్థాయిలో ఎమ్మెల్యే ఎన్నిలకు లేని విధానాలు పంచాయితీల్లో ఎందుకు చొప్పించాలి. రిజర్వేషన్లపై మడతపేచీలు లేకుండా ఎందుకు చేసుకోవాలి. రిజర్వేషన్లపై ఐదేళ్లకోమారు ఎందుకు స్పష్టత లేకుండా నిర్ణయాలు తీసుకుంటారన్నది అర్థం కావడం లేదు. సమయం ముగిసినా నిర్ణయాలు తీసుకోక పోవడం వల్లనే కోర్టులు జోక్యం చేసుకోవాల్సి వస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని గ్రామ పంచాయతీల పాలక వర్గాల గడువు ముగిసిందన్న పేరుతో ప్రత్యేక అధికారులను నియమించడం పంచాయితీల ప్రతిపత్తిని ప్రశ్నించడం తప్ప మరోటి కాదు. స్థానిక సంస్థలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించడం రాష్ట్ర ప్రభుత్వ విద్యుక్త ధర్మం. ఆ బాధ్యతను నిర్వర్తించడంలో ప్రభుత్వాలు ఫలమయ్యానే చెప్పాలి. సకాలంలో నిర్ణయాలు తీసుకుని ఉంటే ఇలా జరిగేది కాదు. ఇక ఈ విషయంలో గతంలో అధికారం వెలగబెట్టిన కాంగ్రెస్ ఏనాడూ సకాలంలో పంచాయితీ ఎన్నికల నిర్వహించలేదు. గ్రామ స్వరాజ్యం, స్థానిక స్వపరిపాలన వంటివి జాతీయోద్యమం నాటి నుండీ ప్రజల ఆకాంక్షలుగా వున్నాయి. స్థానిక సంస్థల నిర్వహణకు సంబంధించి 1957లో బల్వంతరాయ్ మెహతా కమిటీ నియామకం మొదలు భారత ప్రభుత్వం అనేక ప్రయత్నాలు గావించింది.
ఆ క్రమంలో 1993 ఏప్రిల్ 24 నుండి అమలు లోకి వచ్చిన 72, 73వ రాజ్యాంగ సవరణలు ప్రముఖంగా పేర్కొనదగినవి. స్థానిక సంస్థలకు నిధులు, విధుల కేటాయింపుతో సహా అనేక పాలనాపరమైన అంశాలపై దేశ వ్యాపితంగా ఒకే విధానాన్ని రూపొందించారు. వివిధ అంశాలతో పాటు ప్రతి ఐదేళ్లకు ఒకసారి తప్పక ఎన్నికలు నిర్వహించాలన్న నిబంధన అత్యంత కీలకమైనది. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిబంధనను అమలు చేయదేమోనన్న సందేహంతోనే అలా ఎన్నికలు జరగని సంస్థలకు కొన్ని పద్దులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ నిధుల మంజూరును నిలిపివేయాలన్న నిబంధననూ జోడించింది. అయినా సకాలంలో ఎన్నికలు జరగడం లేదు. నేరుగా నిధులు విడుదల కారణంగా ప్రభుత్వాలకు జోక్యం లేకుండా పోతోంది. రాష్ట్ర ప్రభుత్వాలు చేసే తప్పునకు ఆయా స్థానిక సంస్థలకు రాజ్యాంగబద్ధంగా అందవలసిన నిధులను కేంద్రం నిరాకరిసతూ వస్తోంది. అయితే, సకాలంలో ఎన్నికలు జరపాలన్న స్ఫూర్తితోనే ఇలాంటి నిబంధన విధించాల్సి వచ్చిందని కేంద్రం వివరించింది. రిజర్వేషన్లు గురించి తేలకపోవడం వల్లనే ఎన్నికలు వాయిదా వేయవలసి వచ్చిందన్న కారణంగా ప్రత్యేకాధికారుల చేతికి పగ్గాలు వెల్లాయి. స్థానిక సంస్థలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించడం, రాజ్యాంగబద్ధంగా వాటికి నిధులు, విధులు బదలాయించడం విధిగా జరగాలి. ప్రజాతంత్ర వికేంద్రీకరణ, ప్రజలందరినీ భాగస్వాముల్ని చేసి ముందుకు సాగడం ద్వారా గ్రావిూణ అర్థిక వ్యవస్థకు నాంది పలకాలి. సకాలంలో ఎన్నికలు జరిగిన సందర్భాలు తక్కువనే చెప్పాలి. కాంగ్రెస్, బిజెపి, ఇతర పాలకవర్గ పార్టీలు అధికారంలో వున్నా ఎక్కడా అమలు కావడం లేదు. అధికారం చేజిక్కించుకుని స్థానిక సంస్థలను తమ గుప్పెట్లో పెట్టుకోవాలన్న ఆలోచనలతో అధికరాంలో ఉన్న పార్టీలు ఎన్నికల నిర్వహణ అన్నది తమకు అనుకూల సమయమా కాదా అన్న ఆలోచన చేస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఇప్పటికైనా చర్యలు చేపట్టాలి. రాజ్యాంగ నిర్దేశిత హక్కులను అమలు చేసే బాధ్యత ప్రభుత్వాల బాధ్యత కావాలి.