పంజాబ్ గెలుపు

6g37etsiముంబై: ఐపీఎల్-8లో కింగ్స్ లెవెన్ పంజాబ్ బోణీ కొట్టింది. ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్లో పంజాబ్ 18 పరుగులతో ముంబై ఇండియన్స్పై విజయం సాధించింది. తాజా సీజన్లో పంజాబ్కిది తొలి విజయం కాగా, ముంబైకి రెండో పరాజయం. ముంబై స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆల్ రౌండ్ షోతో అదరగొట్టినా ఫలితం లేకపోయింది. 178 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ముంబై పూర్తి ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులే చేయగలిగింది. టాపార్డర్ బ్యాట్స్మెన్ రోహిత్ (0), ఫించ్ (8), తారె (7), కోరి ఆండర్సన్ (5) ఘోరంగా విఫలమయ్యారు. చివర్లో హర్భజన్ చెలరేగి మ్యాచ్కు ఊపు తెచ్చాడు. హర్భజన్ 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఐపీఎల్లో ముంబై తరపున ఇదే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ కావడం విశేషం. హర్భజన్ (24 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 64), సుచిత్ (34) తో కలసి జట్టును గెలిపించే ప్రయత్నం చేశాడు. అయితే సాధించాల్సిన రన్రేట్ ఎక్కువగా ఉండటంతో ఓటమి తప్పలేదు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది.  పంజాబ్ ఓపెనర్లు సెహ్వాగ్, మురళీ విజయ్ రాణించారు. డాషింగ్ బ్యాట్స్మన్ వీరేంద్ర సెహ్వాగ్ చాలా రోజుల తర్వాత మెరుపులు మెరిపించాడు. సెహ్వాగ్ 19 బంతుల్లో 6 పోర్లు, సిక్సర్లతో 36 పరుగులు చేశాడు. మురళీ విజయ్ 35, డేవిడ్ మిల్లర్ 24 పరుగులు చేశారు. చివర్లో పంజాబ్ కెప్టెన్ జార్జి బెయిలీ మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో పంజాబ్ భారీ స్కోరు సాధించింది. బెయిలీ (32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 61 నాటౌట్) సూపర్ హాఫ్ సెంచరీ చేశాడు. ముంబై బౌలర్లు మలింగ, హర్భజన్ రెండేసి వికెట్లు తీశారు.