పంట మార్పిడితోనే మెరుగైన దిగుబడి

భూసారం నిలుస్తుందన్న వ్యవసాయాధికారులు
విశాఖపట్టణం,డిసెంబర్‌14 (జనం సాక్షి)  :   రైతులు పంట మార్పిడి చేసుకోవడం ద్వారా భూసారాన్ని కాపాడు కోవడంతో పాటు, పంటల దిగుబడి పెంచుకోవచ్చని వ్యవసాయాధికారులు తెలిపారు. ఏటా ఒకే పంట వెయ్యడం వలన దిగుబడులు ఆశించిన స్థాయిలో రావడం లేదని తెలిపారు. స్థానిక ప్రాంతీయ వ్యవసాయ
పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. రైతులు పంట మార్పిడే కాకుండా కనీసం రకాలను మార్చడం లేదన్నారు. చెరకులో నూతన రకాలు ఉన్నాయని వాటిని సాగు చేసుకోవాలని చెప్పారు. విత్తనం నిమిత్తం ప్రత్యేకంగా తోటలు పెంచుకోవాలని వివరించారు. ఆరునెలల వయసు గల చెరకును విత్తనంగా వాడాలని చెప్పారు. చెరకులో బిందు సేద్యం ద్వారా నీరు, ఎరువులు ఇవ్వాలని చెప్పారు. జిల్లాలో ఏటా పూర్తిస్థాయిలో వర్షాలు పడుతున్నా కురుస్తున్న రోజుల సంఖ్య తగ్గిపోతోందన్నారు. ఒకేసారి ఎక్కువ వర్షం పడుతోందని.. ఇదంతా వృథాగా పోతోందని వివరించచారు. ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందని వివరించారు. బిందు సేద్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, రైతులకు 90 శాతం రాయితీ ఇస్తున్నారని చెప్పారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.