పక్కాగా భూరికార్డుల తయారీ
వెబ్‌సైట్ అందుబాటులోకి వస్తేనే మేలు
అక్రమాలపై ఫిర్యాదులు స్వీకరించేలా చూడాలి
హైదరాబాద్/అమరావతి.జూలై26(జనంసాక్షి): ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో భూముల వివరాల సేకరణ జరిగింది. ప్రతి రైతు తమ భూముల వివరాలను తెలియచేసేలా చర్యలు చేపట్టారు. ఇందులో వివిధ రకాలుగా ఉన్న భూమలు వివరాలు సేకరరించామని ప్రకటించారు. తెలంగాణ,ఆంధ్రాల్లో సేకరించిన భూముల వివరానలు ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేసేందుకు ఉపక్రమించారు. తెలంగాణ భూ సర్వే, ఆంధ్రాలో భూధార్ ద్వారా ఏర్పాట్లు సాగాయి. ఎవరు హక్కుదారులో తెలియచేస్తే కొనుగోలు అమ్మకాల్లో మోసాలకు ఆస్కారం ఉండదు.అలాగే భూదందాలకు అవకాశం రాదు. ఇటీవల మియాపూర్, విశాఖ భూకుంభకోణాలు కలకలం సృష్టించిన నేపథ్యంలో భూముల వివరాలను ఓపెన్ డాక్యుమెంట్‌గా చేయాలి. అలాగే అనేక వేల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యాయి. వాటి వివరాలను కూడా పొందుపర్చాలి. ప్రతి అంగుళం భూమికి కచ్చితమైన వివరాలు యాజమాన్య హక్కులు నిర్ణయిస్తామని చెబుతున్న ప్రభుత్వం దేవాదాయ, అసైన్డ్ ల్యాండ్ వివరాలను గ్రామాల వారీగా ప్రకటించాలి.గ్రామాలు, మండలాలు, జిల్లాల వారిగా భూముల వివరాలను అందుబాటులోకి తీసుకుని వస్తే అక్రమాలను అడ్డుకోవడం వీలవుతుంది. అలాగే ఆయా భూములు,పంటల వివరాలు కూడా తెలుస్తాయి. ప్రధానంగా ప్రభుత్వ భూములతో పాటు లక్షల ఎకరాల దేవాలయ భూములు అన్యాక్రాంతం అయ్యాయి. సర్వేద్వారా వాటిని గుర్తించి అలాంటి భూములను దేవాదాయ శాఖ అధికారులు రక్షించుకునే ప్రయత్నం చేయాలి. ఇకపోతే ఇలా అక్రమంగా స్వాధీనం చేసుకున్న అనేకమంది రైతులు లేదా ఇతరులు దేవాదాయ భూముల వివరాలు చెప్పకుండా గోప్యంగా ఉంచారని తెలుస్తోంది. గ్రామాల్లో ఈ భూములకు సంబంధించిన వివరాలు సకరించడంలో విఫలమైన అధికారులపై చర్య తీసుకోవాలి. భూముల రికార్డులన్నింటినీ సక్రమంగా నిర్వహించేందుకు వచ్చె నెలలో స్పెషల్‌డ్రైవ్ ప్రారంభించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిదే. దీంతో వివాదాల్లో ఉన్న భూములు ఎవరివనేది తేల్చేస్తారు. పంటల సాగు నుంచి మొదలు ధరల నిర్ణయం వరకు రైతులను సంఘటితం చేసేందుకు వీలుగా ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే రైతు సమగ్ర సర్వే ద్వారా ఒక అంచనాకు వచ్చిన అధికారులు, రైతుల సంఖ్య, సాగు విస్తీర్ణం, పంటల సాగు తదితర వాటి వివరాలతో సమగ్రంగా ప్రణాళిక రూపొందిస్తున్నారు. వీటిని ధరణి వెబ్సైట్‌లో పొందుపరుస్తారు. ఇందులో భాగంగా తొలుత రైతుల వివరాలు సంగణకంలో పొందు పరుస్తున్నారు. దళితులకు భూమి పంచాలనుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం వివరాల సేకరణలో లోటుపాట్లు లేకుండా ఆదేశాలు ఇవ్వాలి. కేసీఆర్ ప్రకటించిన రైతు సంఘాలు, పెట్టుబడి సాయం, పంట కాలనీలు, భూ రికార్డుల నిర్వహణ, కొత్త పాసుపుస్తకాలు తదితర కార్యక్రమాలు కార్యరూపం దాల్చాలంటే సమగ్ర వివరాలు అవసరం. ఇప్పటి వరకు ఇలాంటి వివరాలు నమోదయ్యాయా లేదా అన్నది ఆరా తీయాలి. అలా జరగని పక్షంలో గ్రామాలనుంచి వివరాలను రాబట్టాలి. ఇందుకు సర్పంచ్‌లు, మాజీ పట్వారీల సాయం తీసుకోవాలి. భూరికార్డుల నిర్వహణ ను మరింత సరళతరం చేయడం కోసం వివరాలను తీసుకోవడం మంచిదే. భూక్రయవిక్రయాలు, వారసత్వ మార్పులు రిజిస్టేష్రను తహసీల్దార్లు, గ్రామ రైతు సంఘానికి కచ్చితంగా తెలియచేయాలి. వారికి తెలిపిన తర్వాతే రిజిస్టర్ చేయాలి. గ్రామాల వారీగా సాగు విస్తీర్ణం, రైతుల ఇకపోతే పేర్లు, సంఖ్య తదితర వివరాలు అందుబాటు లో ఉన్నాయి. ప్రభుత్వం ఆదేశిస్తే విధి విధానాలకు తగ్గట్టుగా చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు అంటున్నారు. ఇలా రెండు తెలుగు రాష్ట్రాలు భూముల అక్రమార్కులను గుర్తించేందుకు రికార్డుల నమోదును పక్కాగా,పారదర్శకంగా చేపట్టాలి. అప్పుడే ప్రజలకు నమ్మకం కలుగుతుంది. కేవలం కంటితుడుపు చర్యగా, ఓట్లు కొల్లగొట్టే చర్యగా కార్యక్రమాలు లేకుండా చూసుకోవాలి.