పడకేసిన పాపికొండల పర్యాటకం
రాజమండ్రి,సెప్టెంబర్3(జనం సాక్షి): ఈ ఏడాది గోదావరి నదిలో జరిగిన వరుస ప్రమాదాల నేపథ్యంలో పాపికొండలు పర్యాటకం కుదేలైంది. నెలల తరబడి పర్యాటక బోట్లు, లాంచీలు గోదావరి ఒడ్డులకేపరిమితమయ్యాయి. దేవీపట్నం మండలంలోని పూడిపల్లి- వీరవరపులంక మధ్యలోని పాపికొండలుకు వెళ్తున్న పర్యాటక బోట్లులో మంటలు చెలరేగడంతో అప్పట్లో బోటులోని 120 మంది పర్యాటకులకు భారీ ప్రమాదం తప్పింది. ఆ తరువాత మంటూరు- వాడపల్లి మధ్యలోని గోదావరి నదిలో లాంచీ మునిగిన ప్రమాదంలో 19 మంది మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. అనంతరం ఐ.పోలవరం మండలం పశువుల్లంక వద్ద పడవ మునిగిన ప్రమాదంలో పాఠశాల విద్యార్థులు మృతి చెందారు. ఇలా జరిగిన వరుస ప్రమాదాలు, ఇంతలో వచ్చిన భారీ వదరల కారణంగా పాపికొండలు పర్యాటకం నిలిచిపోయింది. మరోవైపు గోదావరికి వరద నీరు తగ్గుతోంది. పాపికొండలు విహారయాత్రకు వెళ్లడానికి పర్యాటక బోట్లు సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు ఈ విహార యాత్రకు ఒకే ఒక్క పర్యాటక బోటుకు మాత్రమే అధికారుల అనుమతులు ఉన్నాయి. ఇటీవల వరదల నేపథ్యంలో రూట్ పర్మిషన్ ఇవ్వకపోవడంతో అదీ తిరగలేదు. కొన్నాళ్లుగా బోట్లు, లాంచీలు గోదారి ఒడ్డుకే పరిమితమయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో గోదావరి గ్రాండ్(2) పర్యాటక బోటుకు కాకినాడ పోర్టు అధికారుల నుంచి లైసెన్సు లభించింది. దేవీపట్నం మండలంలోని పోశమ్మగండి, విలీన మండలాల పరిధిలోని పోచారం, పశ్చిమగోదావరి జిల్లాలోని సింగనపల్లి (కంపెనీ) వద్ద నుంచి బోట్లు, లాంచీలు మొత్తం 70 వరకు ఉన్నాయి. ఇవన్నీ నిత్యం పాపికొండలుకు పర్యాటకులను తీసుకు వెళ్తుండేవి. ఒక్క బోటుకు మాత్రమే అనుమతులు ఉండగా.. మిగిలిన వాటిలో కొన్ని బోట్ల యజమానులు కాకినాడ పోర్టు అధికారులకు లైసెన్సులు కోసం దరఖాస్తులు చేసుకున్నారు. వాటికి ఇప్పటి వరకు అనుమతులు మంజూరు చేయలేదని తెలిసింది. గతంలో పర్యాటక బోట్లు, లాంచీలు, ఫెర్రీ రేవు నావలకు జలవనరుల శాఖ అధికారులు లైసెన్సులు మంజూరు చేసేవారు. ప్రసుత్తం కాకినాడ పోర్టు అధికారులు మాత్రమే అనుమతులు ఇస్తున్నారు. గతంలో పర్యాటక బోట్లు, లాంచీలకు లైసెన్సు గడువు ముగియడంతో అప్పట్లో వీటన్నింటికీ మూడు నెలల పాటు ఆగస్టు 31 వరకు పొడిగించారు. ప్రసుత్తం మిగిలిన బోట్లుకు పోర్టు అధికారులు ఇంకా అనుమతులు ఇవ్వలేదని సమాచారం.