పడవ బోల్తా బాధితులకు అండగా ఉంటాం
– గాలింపులో ఎలాంటి ఫలితం దక్కలేదు
– మృతుల కుటుంబాలకు రూ. 5లక్షలు సాయం అందిస్తాం
– కోనసీమలో అవసరమైన అన్ని గ్రామాలకు ఇంజిన్ బోట్లు ఏర్పాటు చేస్తాం
– ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప
పశువుల్లంక, జులై17(జనం సాక్షి) : తూర్పుగోదావరి జిల్లా పశువుల్లంక పడవ ప్రమాదంలో గల్లంతైన వారి కోసం నాలుగోరోజు మంగళవారం గాలింపు కొనసాగుతోంది. మంగళవారం గాలింపు చర్యల్లో డిప్యూటీ సీఎం చినరాజప్ప పాల్గొన్నారు. ఆయనతోపాటు కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎస్పీ విశాల్ గున్నీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ మంగళవారం గాలింపులో ఎలాంటి ఫలితం దక్కలేదన్నారు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల సాయం అందజేస్తామని చినరాజప్ప తెలిపారు. కోనసీమలో అవసరమైన అన్ని గ్రామాలకు ఇంజిన్ బోట్లు ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలో ఫంట్‌లు తయారు చేయించి ప్రమాదకరమైన గోదావరి పాయల్లో పెడతామని చినరాజప్ప వెల్లడించారు. కాగా ఇప్పటి వరకు ఇద్దరి మృతదేహాలు లభ్యం కాగా, మరో ఐదుగురి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. మంగళవారం వరకూ యానాం రాజీవ్ గాంధీ బీచ్ కేంద్రంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. మంగళవారం యానాం సావిత్రినగర్, భైరవపాలెం కేంద్రంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అనంతరం ఆయన విూడియాతో మాట్లాడుతూ… కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైన్ వంతెన నిర్మాణానికి కేంద్రం తక్షణమే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గోదావరిలో రోజురోజుకూ కోతకు గురవుతున్న శేరుల్లంక రక్షణకు తక్షణం చర్యలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారని రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు చెప్పారు. జీవోలు విడుదల చేసి ఏడాదిన్నర అయినా గోదావరిలో లంక గ్రామాల రక్షణకు నిర్మాణ పనులు ప్రారంభించకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిపారు. గోదావరి లంక గ్రామాల్లో 8 చోట్ల పంటలు ఏర్పాటు చేస్తామని కలెక్టర్ కార్తికేయ మిశ్రా పేర్కొన్నారు.